మ‌న‌సులో మాట‌ మొహ‌మాటం లేకుండా చెప్పేసిన జ‌గ‌న్‌.. !


కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ అగ్ర‌నాయ‌కుల ద‌గ్గ‌ర ఏపీ సీఎం జ‌గ‌న్ మొహ‌మాటం లేకుండా మాట్లాడేశారా ? ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టారా ? ఇక‌, ఆలోచిస్తూ.. కూర్చుంటే.. రోజులు నెల‌లు సంవ‌త్స‌రాలు కూడా జ‌రిగిపోతాయ‌ని.. ఈ క్ర‌మంలో ఏదైతే అదే జ‌రుగుతుంద‌ని ఆయ‌న కేంద్రం వ‌ద్ద ఉన్న విష‌యాల‌ను క‌క్కేశారా ? అంటే.. ఔన‌నే అంటోంది జాతీయ మీడియా. నిజానికి జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. ప్లీజ్ .. ప్లీజ్‌.. అంటూ.. ఏపీకి సంబంధించిన విష‌యాల‌పై చ‌ర్చించేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

దీంతో పోల‌వ‌రం స‌హా.. ప్ర‌త్యేక హోదా.. వంటి కీల‌క విష‌యాలు ముందుకు సాగ‌డం లేదు. ఇది జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారింది. రాజ‌కీయంగా ప‌క్క‌న పెడితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు.. రాష్ట్రానికి గ‌త సీఎం చంద్ర‌బాబు క‌న్నా ఎక్కువ చేసి చూపించాల్సిన బాధ్య‌త జ‌గ‌న్‌పై ఉంది. లేక‌పోతే..రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వైఫ‌ల్యాలే..ఆయ‌న‌కు మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. పైగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌నే అప‌వాదు ప‌డుతుంది. దీంతో త‌న 30 ఏళ్ల ముఖ్య‌మంత్రి క‌ల నెర‌వేర‌డం కూడా క‌ష్ట‌మే.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. త‌న మ‌న‌సులోని మాట‌ను నిర్మొహ‌మాటంగా మాట్లాడేశార‌ని.. ఏం జ‌రిగినా.. ఎదుర్కొనేందుకు.. అంటే.. ఒక‌వేళ త‌న వ్యాఖ్య‌ల‌తో కేంద్రంలోని పెద్ద‌లు ఆగ్ర‌హానికి గురై.. త‌న‌పై వ్య‌క్తిగ‌త చ‌ర్య‌లు తీసుకున్నా కూడా ఎదుర్కొనేందుకు జ‌గ‌న్‌ రెడీ అయ్యార‌ట‌. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు.. తాను ఎన్నికల‌ స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌కే ప్రాధాన్యంఇచ్చార‌ని.. జాతీయ మీడియా వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే మూడు రాజ‌ధానులు, పోల‌వ‌రం, స‌హా.. జిల్లాల ఏర్పాటు, క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు వంటి వాటిని బ‌ల్ల‌గుద్ది మ‌రీ.. టైంబౌండ్ కోసం ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు మీడియా వెల్ల‌డించింది.

ఈ క్ర‌మంలోనే తెలుగు మీడియా జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న విష‌యంలో ముందుగా వేసుకున్న అంచ‌నాలు కూడా త‌ల్ల‌కిందులు అయ్యాయ‌ని తెలుస్తోంది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు జ‌గ‌న్ వెళ్తున్నాడ‌ని తెలియ‌గానే తెలుగు మీడియా.. ఆయ‌న కేసుల మాఫీ కోస‌మే వెళ్తున్నార‌ని.. బెయిల్ ర‌ద్దుకోస‌మే వెళ్తున్నార‌ని ప్ర‌చారం చేసింది. కానీ, ఢిల్లీలో జ‌గ‌న్‌కేంద్ర మంత్రుల‌ను నిల‌దీయ‌డంతోపాటు.. ఇంకెన్నేళ్లు ఎదురు చూడాల‌ని ప్ర‌శ్నించ‌డంతో సీన్ మారిపోయింద‌ని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ బాగానే ఒత్తిడి తెచ్చినా.. కేంద్రం ఏమేర‌కు ఏపీపై క‌రుణ చూపుతుందో ? చూడాలి.