రఘురామ పై వైసీపీ సీరియస్ యాక్షన్..!

నర్సాపురం ఎంపీ రఘురామ రాజుని ఏదో ఒకటి చేసేదాక.. వైసీపీ నేతలకు నిద్రపట్టేలా కనపడట్లేదు. ఇప్పటికే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు. ఈ కేసుతో అయినా.. ఆయన సైలెంట్ అవుతారని అందరూ భావించారు. అయితే.. ఆయన ఏమాత్రం తగ్గకుండా.. తిరిగి రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీంతో.. ఈసారి వైసీపీ అధిష్టానం సీరియస్ యాక్షన్‌కు దిగింది.

దీనిలో భాగంగా ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ శుక్రవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామను వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా కోరారు.

మరోవైపు తనను అరెస్ట్ చేసి జైలులో పెట్టేందుకు యత్నించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే సమస్యే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత రాజుగారు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు, లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లు, తోటి ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లకు లేఖ రాశారు రఘురామ. మీడియాతో మాట్లాడకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూనే లేఖలతో ద్వారా తన పోరాటం సాగిస్తున్నారు.

జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రఘురామ ఆరోపించారు. దీనిలో భాగంగానే తనను అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు. పార్లమెంటులో మీ పార్టీ ఎంపీలు తనకు మద్దతు ఇచ్చేలా చూడాలని ఆయన సీఎంలను కోరారు. తనపై సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసును తొలగించాలని కోరుతూ అసెంబ్లీల్లో తీర్మానాలు చేయాలని, ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఆయన ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)