సీఎం పదవి పోవడం ఖాయమేనా?

కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు పదవీగండం పొంచుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి. చాలాకాలంగా యడ్డీని సీఎంగా దింపేందుకు ప్రత్యర్ధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఎంఎల్ఏల సంతకాల సేకరణ కూడా ఊపందుకుంది. యడ్డీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ఎంఎల్ఏల సంతకాలతో ఇటీవలే కొందరు నేతలు ఢిల్లీ వెళ్ళి అగ్రనేతలను కలిసినట్లు సమాచారం.

యడ్డీ ఎప్పుడు సీఎంగా ఉన్నా ఇదే సమస్య మొదలవుతోంది. పార్టీలోని తన ప్రత్యర్ధులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, అవినీతికి లాకులెత్తటం, ప్రభుత్వాన్ని తనిష్టారాజ్యంగా నడపుతారనే ఆరోపణలు యడ్డీపై చాలా ఉన్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్నిసార్లు సీఎంగా దిగిపోయినా యడ్యూరప్ప తన పద్దతి మార్చుకోవటానికి మాత్రం ఇష్టపడటంలేదు.

అందుకనే కుర్చీలో కూర్చుని కొంతకాలం కాగానే వ్యతిరేకులు పెరిగిపోతుంటారు. ఇపుడు జరిగింది కూడా అదే. యడ్డీ వ్యవహారశైలిపై అగ్రనేతల్లో కూడా అసంతృప్తి మొదలైనట్లు ఎంఎల్ఏలు, సీనియర్ నేతలకు సంకేతాలు అందాయట. దానికితోడు ఎంఎల్ఏలందరితో మాట్లాడేందుకు ఢిల్లీ నుండి పార్టీ వ్యవహార ఇన్చార్జి అరుణ్ సింగ్ ఈనెల 17,18 తేదీల్లో బెంగుళూరుకు వస్తున్నారు. సీఎం మార్పు తప్పదనేందుకు ఇదే సంకేతాలుగా పార్టీలో చర్చ ఊపందుకుంది.

యడ్డీ పనితీరుపై అగ్రనేతలంతా సంతృప్తిగా ఉన్నారని అరుణ్ సింగ్ ఒకవైపు చెబుతునే ఎంఎల్ఏల్లో అసంతృప్తి విషయమై చర్చించేందుకు తాను బెంగుళూరుకు వస్తున్నట్లు సింగ్ చెప్పటం గమనార్హం. కోవిడ్ పరిస్దితులను సీఎం బాగా హ్యాండిల్ చేస్తున్నట్లు సింగ్ యడ్డీకి కితాబిచ్చారు. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు భిన్నంగా ఉన్నాయి. రోజుకు వందలాదిమంది చనిపోవటమే కాకుండా 30వేలమందికి పైగా కరోనా వైరస్ బారినపడిన రోజులున్నాయి కర్నాటకలో.

సో జరుగుతున్నది చూస్తుంటే యడ్డీ మార్పు విషయంలో అగ్రనేతలు ఏదో నిర్ణయం తీసుకోక తప్పదని అర్ధమైపోతోంది. మరి మెజారిటి ఎంఎల్ఏలు, మంత్రులను కాదని అగ్రనేతలు యడ్డీనే కంటిన్యు చేస్తారా ? లేదా మెజారిటి నిర్ణయాన్ని ఆమోదిస్తారా ? అనేది మూడోవారంలో తేలిపోతుంది. మొత్తానికి కర్నాటకలో బీజేపీ రాజకీయాలు క్లైమ్యాక్స్ కు చేరుకుంటున్నట్లే అనిపిస్తోంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.