జూ.ఎన్టీఆర్ పార్టీలో రావటంపై బాలయ్య వ్యాఖ్యలు ప్లస్సా.. మైనస్సా?

సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించటానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు అడ్డాలోనూ జూనియర్ ఎన్టీఆర్ జెండా ఎగరటం కలకలం రేపింది. రాజకీయ చర్చకు తెర తీసింది. ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు సందర్భంగా ఒక టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు బాలయ్య.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగం మీద ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఎవరిష్టం వాళ్లదని.. వారి ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారన్న బాలయ్య.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద తాను పెద్దగా ఆలోచించలేదన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా? అంటూ వేసిన ప్రశ్నకు వెంటనే బదులివ్వలేదు బాలయ్య.

కాసేపు మౌనంగా ఉన్న తర్వాత చిరునవ్వు నవ్విన ఆయన.. ఎన్టీఆర్ రావటంతో ప్లస్ అయి తర్వాత మైనస్ అయితే ఏమిటని ప్రశ్నించారు. మరోసారి నవ్వుతూ.. ప్లస్.. మైనస్ ఆల్ వేజ్ బ్యాడ్. ప్లస్ + ప్లస్, మైనస్ ఈజ్ ప్లస్.. అంటూ తనదైన శైలిలోకి వెళ్లిపోయి పలు కాంబినేషన్లు చెప్పి విషయాన్ని పక్కదారి వెళ్లేలా చేశారు. మొత్తంగా చూస్తే గతానికి భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావటంపై బాలయ్య అంత ఆసక్తిని ప్రదర్శించకపోవటం కొట్టొచ్చినట్లుగా చెప్పక తప్పదు.

ఏమైనా.. బాలయ్య చేసిన “ప్లస్సా.. మైనస్సా” అన్న వ్యాఖ్యలపై రానున్న రోజుల్లో మరింత చర్చ జరగటం మాత్రం ఖాయమని చెప్పక తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే ప్లస్సా.. మైనస్సా అన్నది ఎంత ఆసక్తికరమో.. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్య పార్టీకి ఏ మేరకు ప్లస్ అవుతుంది? మరెంత మైనస్ అవుతుందన్నది కూడా కాలమే డిసైడ్ చేయాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)