కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తిరిగి తెరిచేందుకు తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని బావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని కూడా భావిస్తోందని అన్నారు. ఇక, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు .. వచ్చే నెల 5వ తేదీ తర్వాత స్కూళ్లను ప్రారంభించేందుకు కేసీఆర్ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది కూడా కరోనా ఫస్ట్ వేవ్ నేపథ్యంలో స్కూళ్లను పూర్తిగా బంద్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. పది, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్ క్లాసులు పెట్టినా.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు రావడంతో వాటిని కూడా ఆపుచేశారు. ఇక, తాజాగా ఇంటర్ రెండు సంవత్సరాలు, పదో తరగతి పరీక్షలను వరుసగా రెండో ఏడాది కూడా రద్దు చేసిన ప్రభుత్వం.. పరిస్థితి ఇలానే ఉంటే.. కష్టమని భావిస్తోంది. ఇదే అభిప్రాయం తల్లి దండ్రుల నుంచి వ్యక్తం అవుతున్నట్టు అధికారులు కూడా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా స్కూళ్లను ప్రారంభించకపోతే విద్యార్థుల భవితవ్యం ఇబ్బందుల్లోకి జారుతుందని భావించిన కేసీఆర్ సర్కార్.. ఈ నెల 16 నుంచి 8-ఇంటర్ వరకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అదేసమయంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను అన్ని తరగతులను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఈ స్కూళ్లను రోజు విడిచి రోజు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.