జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి

పొరుగు రాష్ట్రం తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి పెరిగిపోతోంది. తెలంగాణాలో ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సహజంగానే జగన్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎందుకంటే ఏపిలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు, 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశంపార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

కారణాలు స్పష్టంగా తెలియకపోయినా ప్రభుత్వం కూడా పరీక్షల రద్దు చేయటానికి పెద్దగా ఇష్టపడటంలేదు. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాతైనా సరే పరీక్షలు నిర్వహించటానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. బహుశా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల రద్దుపై టీడీపీ చేస్తున్న గోల కారణంగానే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు పట్టుబడుతున్నట్లే కనిపిస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీనో లేకపోతే ప్రతిపక్షాలు డిమాండ్లు చేశాయని ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. ఎవరెన్ని డిమాండ్లు చేసినా ప్రభుత్వం తన నిర్ణయమేదో తాను తీసుకుంటుంది. ఈ విషయం బాగా తెలిసినా పరీక్షల రద్దుకోసం లోకేష్ పదే పదే కావాలనే డిమాండ్లు చేస్తున్నారు. పరీక్షల రద్దు నిర్ణయం తమ ఒత్తిడిమేరకే జరిగిందనే రాజకీయ లాభంకో సం లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి రెండుసార్లు పరీక్షల నిర్వహణకు నిర్ణయించిన ప్రభుత్వం చివరి నిముషంలో వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణ వాయిదాకు తమ ఒత్తిడే కారణమంటు లోకేష్ గొప్పగా ప్రకటించుకున్నారు.

పరీక్షలను ఎలాగైనా రద్దుచేయించి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని లోకేష్ ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. బహుశా ఆ క్రెడిట్ టీడీపీకి దక్కకూడదన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే పట్టుదలగా ఉంది. ఇదే సమయంలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చెబుతున్న కారణం కూడా చాలా సిల్లీగా ఉంది. ఏదో పాస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే విద్యార్ధులకు మంచి కాలేజీల్లో సీట్లు రావని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

నిజానికి కరోనా వైరస్ సమస్యన్నది ఒక్క ఏపిలోనే కాదు. యావత్ దేశం గట్టిగా మాట్లాడితే ప్రపంచమంతా ఉంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తే మరికొన్ని రాష్ట్రాలు వాయిదా వేశాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం రద్దుచేశాయి. ఇపుడు తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న పరీక్షల రద్దు నిర్ణయం జగన్ పై ఒత్తిడి పెంచటం ఖాయమనే అనిపిస్తోంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)