మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ కు తెరపడి ఉప ఎన్నిక వైపు వేగంగా పరిణామాలు మారుతున్న సంగతి తెలిసిందే. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు ఈటల రాజేందర్ ప్రకటించారు. దీంతో ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరగడం ఖాయంగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పరోక్షంగా ముందుకు సాగుతుంటే ఈటల రాజేందర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.
అసైన్డ్ భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని వివాదంలో చిక్కుకోవడంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేశారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యంగా మారగా టీఆర్ఎస్ ఫోకస్ పెడుతోంది. ఈటల ఇప్పటి వరకూ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటం ద్వారా అక్కడి ప్రజల మన్ననలను పొందాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
హుజూరాబాద్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలంటూ గతంలో ఆందోళనలు జరిగినప్పటికీ ఇది ఆచరణ సాధ్యం కాదంటూ ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇప్పుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట హుజూరాబాద్ జిల్లాను ఏర్పాటు చేయటం ద్వారా అక్కడి ఉప ఎన్నికల్లో మరిన్ని సానుకూల ఫలితాలు సాధించవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.
అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా పరోక్షంగా గేమ్ ప్లే చేస్తుంటే మాజీ మంత్రి ఈటల రాజేందర్ డైరెక్టుగా రంగంలోకి దిగుతున్నారు. నేడు ఈటల మూడు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. కమలాపూర్, శంభునిపల్లి, కానిపర్తి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి అనంతరం మూడు గ్రామాల ప్రజలతో ఈటల చర్చించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక ఆయన మొదటిసారి హుజూరాబాద్ వెళ్తున్నారు. తన కేంద్రంగా జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఈటల వివరించనున్నరాని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates