మొత్తానికి ఒత్తిడికి తలొంచిన మోడి

ఒకవైపు సుప్రింకోర్టు, మరోవైపు మీడియా, ఇంకోవైపు మేధావులు, చివరగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు, చివరకు మామూలు జనాలు..ఇలా అందరు కలిసి నరేంద్రమోడి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పై మండిపడ్డారు. టీకాల కార్యక్రమం అస్తవ్యస్ధం అయిపోవటంతో చివరకు మోడి పరువు అంతర్జాతీయంగా కూడా బురదలో పడిపోయింది. అన్నీ వైపుల నుండి కమ్ముకొచ్చిన ఒత్తిడి ఫలితంగా టీకా కార్యక్రమంపై మోడి దిగిరాక తప్పలేదు.

ఎటువైపు నుండి వచ్చిన ఒత్తిడి పనిచేసిందో ఏమో చివరకు 18-45 ఏళ్ళ మధ్య వాళ్ళందరికీ కేంద్రమే టీకాలను కొని రాష్ట్రాలకు పంపి ఉచితంగా వేయిస్తుందని ప్రకటించారు. నిజానికి మొదటి దశ కరోనా వైరస్ లో కూడా మోడి ఫెయిల్యూర్ వలసకూలీల విషయంలో కళ్ళకు కట్టినట్లు కనిపించింది. అలాగే రు. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ఏమైందో కూడా ఎవరికీ తెలీదు.

అయినా సరే మోడి గెటాన్ అయిపోయారంటే అప్పట్లో పెద్దగా జననష్టం జరగలేదు కాబట్టే. కానీ సెకెండ్ వేవ్ వచ్చేసరికి జననష్టం లక్షల్లో జరిగిపోయింది. ఇదే సమయంలో టీకాలు, ఆక్సిజన్ కొరత పెరిగిపోయింది. ఇదే సమయంలో మోడి తీసుకొచ్చిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ దారుణంగా ఫెయిలైంది. 60 ఏళ్ళ వాళ్ళకి కేంద్రమే టీకాలు కొని వేయించింది. అయితే 18-45 మధ్య వాళ్ళకు మాత్రం రాష్ట్రాలే టీకాలు కొనుగోలు చేసి వేయించుకోవాలని చెప్పింది.

కేంద్రం పాలసీపై రాష్ట్రప్రభుత్వాల్లోనే కాకుండా మామూలు జనాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకంటే రాష్ట్రాలు అడిగినన్ని టీకాలును కంపెనీలు సరఫరా చేయలేకపోయాయి. రాష్ట్రాలకు సరఫరా అయ్యే టీకాల విషయంలో కూడా కేంద్రం నియంత్రణే ఉండటంతో రాష్ట్రావసరాలకు తగ్గట్లు టీకాలు అందలేదు. ఒకవైపు టీకాల కొరత మరోవైపు పెరిగిపోయిన మరణాలతో దేశమంతా మోడిపై దుమ్మెత్తిపోసింది.

చివరకు సుప్రింకోర్టు విచారణలో కూడా తన ఫెయిల్యూర్ పైన చర్చలు జరగటంతో చేసేది లేక చివరకు 18 ఏళ్ళ తర్వాత వాళ్ళకు కూడా కేంద్రమే టీకాలను వేయిస్తుందని మోడి ప్రకటించారు. రాష్ట్రాలు అడిగితేనే 18 ఏళ్ళపైన వాళ్ళకి టీకాలు వేసుకునే వెసులుబాటు కేంద్రం వదిలిపెట్టిందనే అబద్ధం చెప్పటం ఆశ్చర్యం. నిజానికి ఏ రాష్ట్రమూ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తమకు అప్పగించమని కేంద్రాన్ని అడగలేదు.

తనమీద జనాల్లో పెరిగిపోయిన ఆగ్రహాన్ని రాష్ట్రాల మీదకు మళ్ళించేందుకు మోడి ప్రయత్నాలు చేసిన విషయం అర్ధమైపోతోంది. సరే మొత్తానికి మోడి ఒత్తిడికి లొంగినా మంచి నిర్ణయమే తీసుకున్నారు.