తెలంగాణ తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతయిపోయిన పరిస్థితుల్లో మిగితిన అతికొద్ది నేతల్లో ఒకరైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీతో ఆయనకు డీల్ సెట్ అయిందా? ఓ మంత్రి, మరో ఎమ్మెల్యేతో జరిగిన చర్చల ఫలితంగా ఆయన పచ్చ పార్టీకి బైబై చెప్పేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలోనే ఆయన చేరిక ఉంటుందని తెలుస్తోంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఉండదని తెలిసి పొలిట్ బ్యూరో సభ్యుల నుంచి మొదలుకొని మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు నేతలు టీడీపీకి బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఒరవడి కొనసాగుతున్నప్పటికీ పార్టీని అంటిపెట్టుకొని కొందరు నేతలున్నారు. అలాంటి వారిలో మాజీ ఎమ్మెల్యే ఎల్.రమణ ఒకరు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉనికిని కాపాడటంలో ఎల్.రమణ తనవంతు పాత్ర పోషించారు. అయితే, ఆ పార్టీకి భవిష్యత్ లేదని భావిస్తున్న రమణను అధికార టీఆర్ఎస్ పార్టీ తమ గూటికి చేర్చుకునేందుకు ప్లాన్ చేసింది.
టీడీపీ సీనియర్ నేతగా ఓ వెలుగువెలిగి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎల్.రమణ గతంలో ప్రాతినిధ్యం వహించిన జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ కలిసి ఎల్.రమణతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల్లో రమణకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో భర్తీ కాబోయే శాసనమండలి స్థానాల్లో రమణకు బెర్త్ ఖాయం చేశారని సమాచారం. దీంతో రమణ సైతం ఓకే చెప్పి కారు గూటికి చేరనున్నట్లు చెప్తున్నారు. అయితే, ఈ ఎపిసోడ్ పై ఇటు టీఆర్ఎస్ అటు టీడీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.