సానియా మీర్జాలో మరో కోణం

హైదరాబాదీ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. ఆట పరంగా ఎన్ని ఎత్తులు చూసినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో ఆమె అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఆమె పెళ్లి సైతం ఎంతో వివాదాస్పద రీతిలో జరిగింది. అంతకుముందు నిశ్చితార్థం రద్దు కావడమూ వివాదమే.

ఇక భారత జెండా ముందు కాళ్లు చాపి కూర్చోవడం మొదలుపెడితే ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. ఓ పాకిస్థానీని పెళ్లి చేసుకోవడం పట్ల ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది సానియా.

గత ఏడాది ప్రపంచకప్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముంగిట ఈ తిట్లు, శాపనార్థాలు తట్టుకోలేక ఆమె వారం పాటు ట్విట్టర్‌కు దూరమైంది. దీన్ని బట్టి జనాల్లో ఆమెకు ఎలాంటి ఇమేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వివిధ సందర్భాల్లో ప్రవర్తనను బట్టి ఆమెను చాలామంది ఒక పొగరుబోతుగానూ చూస్తారు.

ఐతే సానియాలో మరో కోణమూ ఉందని తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నానా అవస్థలు పడుతున్న వలస కార్మికుల గురించి ఆమె చాలా ఆవేదనగా మాట్లాడింది. మండుటెండల్లో సామాను నెత్తిన పెట్టుకుని, పిల్లల్ని వెంట బెట్టుకుని వందల కిలోమీటర్లు నడుస్తున్న వలస కార్మికుల వీడియోలు చూస్తే గుండె చెరువవుతోందని సానియా పేర్కొంది.

ఒక మహిళ ఓ చేతిలో బిడ్డను, మరో చేత్తో సూట్‌కేస్‌ను పట్టుకుని నడుస్తున్న ఫొటో చూస్తే.. ఇలాంటి వాళ్లు అలా ఉంటే మనం ఇంత సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నామే అన్న అపరాధభావం తనను వెంటాడుతోందని సానియా అంది. ఇలాంటి వాళ్లకు తన వంతు సాయం చేయాలని.. ‘యూత్ ఫీడ్ ఇండియా’ సంస్థతో కలిసి విరాళాలు సేకరించామని.. రూ.3.3 కోట్లు పోగయ్యాయని.. ఈ మొత్తాన్ని వలస కార్మికుల కోసమే ఖర్చు చేస్తున్నామని చెప్పింది సానియా.

వలస కార్మికుల కష్టాల గురించి మాట్లాడితే.. మోడీ సర్కారుకు ఇబ్బందని చాలామంది సెలబ్రెటీలు సైలెంటుగా ఉన్న సమయంలో సానియా ఇలా మాట్లాడటం ఆశ్చర్యమే.