మనదేశంలోని ఆర్ధిక నేరగాళ్ళల్లో ఎక్కువమంది కరేబియన్ దేశాలకే పారిపోవటానికి ప్రాధన్యత ఇస్తున్నారు. కరేబియన్ దేశాలంటే ప్రధానంగా డొమినికా, సెయింట్ లూసియానా, సెయింట్ కిట్స్, గ్రెనడా, బార్బొడాస్, ఆంటీగా వంటివి అన్నమాట. ఇవన్నీ పేరుకు మాత్రమే చిన్న దేశలైనా ఆంతర్జాతీయంగా బాగా పేరున్న దేశాలనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడి ఆర్ధిక నేరగాళ్ళు ఈ దేశాలకు చేరిపోతే చాలు ఇకంతా హ్యపీనే.
మిగిలిన వారిని వదిలిపెట్టేసినా మోహుల్ చోక్సీ, లలిత్ మోడి లాంటి వేల కోట్లరూపాయలు దోచేసుకున్న బడా బడా ఆర్ధిక నేరగాళ్ళంతా ఇపుడు పై దేశాల్లోనే హ్యాపీగా గడిపేస్తున్నారట. తాము దోచుకున్న వేలాది కోట్లరూపాయల్లో కాస్త చిల్లర అంటే ఏ మూడు నాలుగు కోట్లను చల్లితే చాలు పై దేశాల్లో ఏ దేశం పౌరసత్వం కావాలంటే అది దొరికేస్తుంది. ఇక రెండో పద్దతి ఏమిటంటే పై దేశాల్లో ఎంతో కొంత పెట్టుబడి పెడితే చాలు ఆ దేశాల్లో పౌరసత్వం వచ్చేస్తుంది.
పై దేశాల్లో ఉన్న వెసులుబాటు ఏమిటంటే ద్వంద్వ పైరసత్వాన్ని అనుమతించటం. అంటే ఏకకాలంలో రెండు దేశాల్లో సిటిజన్ షిప్ కలిగుండటం. మనదేశంలోని వ్యాపారస్తుల్లో కొందరు ముందు జాగ్రత్తగా పై దేశాల్లో పౌరసత్వాలను తీసుకుంటున్నారు. కారణం ఏమిటంటే వ్యాపారాలను చేస్తామన, పెట్టుబడులు పెడతామని పై దేశాల్లోని ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంటారు.
చట్టప్రకారం దరఖాస్తు సక్రమంగానే ఉంటుంది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి పౌరసత్వాన్ని ఇచ్చేస్తాయి. పెట్టుబడులు రాగానే పై దేశాల్లో శాశ్వత పౌరులైపోతారు. ఇక ఏదో రోజు ముహూర్తం చూసుకుని మనదేశంలో దోచుకున్న వేలాది కోట్ల రూపాయలతో జెండా ఎత్తేస్తున్నారు. జెండా ఎత్తేసే విషయం వాళ్ళకు మాత్రమే తెలుసుకాబట్టి ముందుగానే ఆస్తులను, పెట్టుబడుల రూపంలో డబ్బును పై దేశాలకు తరలించేసి ఉన్నట్లుండి మాయమైతారు.
మనదేశంలో జెండా ఎత్తేసిన వారిని పట్టుకుని తమదేశానికి అప్పగించాలని పై దేశాలతో మనకు ఒప్పందంలేదు. ఆర్ధిక నేరగాళ్ళు మనదేశంలో నేరాలు చేశారే కానీ పై దేశాల్లో కాదు కాబట్టి ఆ దేశాలు వాళ్ళని పట్టించుకోవటంలేదు. పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకని పై దేశాలు అనేక రకాల పన్నుల్లో మినహాయింపినిస్తున్నాయి. అన్నింటికన్నా అతిపెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే పై దేశాల్లో పౌరసత్వం తీసుకుంటే చాలు సుమారు 160 దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. అలాగే విదేశాల్లో భారీగా పెట్టుబడులూ పెట్టవచ్చు. ఇపుడర్ధమయ్యిందా ? పై దేశాలకే ఎందుకని పారిపోతున్నారో ?