జ‌గ‌న్‌పై దేశ‌వ్యాప్త ఆగ్ర‌హం: ఆర్ ఆర్ ఆర్ కు అనూహ్య మద్ద‌తు

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ రాజుకు దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఆయ‌న‌పై సొంత పార్టీ ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరును వివిధ పార్టీల‌కు చెందిన‌ ఎంపీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి, ఎంపీ సుమ‌ల‌త, మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ర‌ఘురామ‌పై జ‌రిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డ‌మా? అని విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

అంతేకాదు, మున్ముందు.. ఎంపీ ర‌ఘురామ‌కు తాము మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని కూడా సుమ‌ల‌త స్ప‌ష్టం చేశారు. ఇక‌, ఢిల్లీకి చెందిన ఎంపీలు కూడా ర‌ఘురామ పై జ‌రిగిన సీఐడీ దాడిని ఖండించారు. ప్ర‌జాస్వామ్యంలో ఒక ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం ఏంట‌ని వారు కూడా నిల‌దీశారు. ఇక‌, ఇప్పుడు తాజాగా కేర‌ళ‌కు చెందిన ఎంపీ ప్రేమ్ చంద్ర‌న్ కూడా ర‌ఘురామ‌పై దాడికి తీవ్రంగా స్పందించారు.

ఈ దాడి కేవ‌లం ఎంపీ ర‌ఘురామ‌పై జ‌రిగింది కాద‌ని.. ఏకంగా మొత్తం పార్ల‌మెంటుకు జ‌రిగిన అవ‌మానంగా ఎంపీ ప్రేమ్ చంద్ర‌న్ అభివ‌ర్ణించారు. తాజాగా ప్రేమ్ చంద్ర‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ర‌ఘురామ‌రాజుకు మ‌ద్ద‌తు ప‌లికారు. ర‌ఘురామ రాసిన లేఖ త‌న‌ను ఎంతో క‌ల‌చి వేసింద‌ని.. ఏపీ పోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌ని.. వ్యాఖ్యానించారు.

ప్ర‌జాప్ర‌తినిధి, అందునా ఎంపీ అయిన వ్య‌క్తిపై లాఠీలు ఎలా ప్ర‌యోగిస్తార‌ని ప్రేమ్ చంద్ర‌న్ నిల‌దీశారు. అంతేకాదు… ఈ విష‌యాన్ని పార్ల‌మెంటులో ప్ర‌త్యేక ప్ర‌స్తావ‌న చేస్తాన‌న్న ఎంపీ.. ఇక్క‌డితో ఈ విష‌యాన్ని వ‌దిలేసే ప్ర‌స‌క్తి లేద‌ని.. రేపు మ‌రో రాష్ట్రంలో ఇలా జ‌ర‌గ‌ద‌ని గ్యారెంటీ ఏంట‌ని.. దీనిపై స్పీక‌ర్‌నే తాము నిల‌దీస్తామ‌ని ప్రేమ్ చంద్ర‌న్ ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ చుట్టూ.. ర‌ఘురామ‌రాజు వ్య‌వ‌హారం మ‌రింత బిగిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.