మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఎపిసోడ్ ముగిసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్‌తో పాటు ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు స్పందించారు. అయితే, వాళ్ల కంటే ఎక్కువగా వామపక్షాల నేతలు ఫీలవుతున్నారని అంటున్నారు. వారు రియాక్ట్ అవుతున్న తీరు దీనికి నిదర్శనమని చెప్తున్నారు.
తనది కమ్యూనిస్టు డీఎన్ఏ అయినప్పటికీ ప్రజల ఒత్తిడి మేరకు బీజేపీ చేరుతున్నానని మీడియా చిట్‌చాట్‌లో ఈటెల రాజేందర్ వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలోనే పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. దీంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పచ్చి అవకాశవాది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతోన్మాద బీజేపీలో చేరుతూ సీబీఐ మీద నిందలు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు ఎవరు కొన్నా తప్పేనని పేర్కొంటూ ఈటల రాజేందర్ వెంటనే ఆ భూములు ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇక మరో వామపక్ష పార్టీ అయిన సీపీఎం సైతం ఈటల ఎపిసోడ్‌పై స్పందించింది. బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. తాను చేస్తున్న అప్రతిష్టాకరమైన పనిని కప్పిపెట్టుకోవడానికి కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం అభ్యంతరకరమన్నారు. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి ఇప్పుడు ఏకంగా మతోన్మాద ఫాసిస్టు బిజెపి పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయం అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే తెలంగాణ ప్రజల లౌకిక వారసత్వాన్ని గౌరవించినవారవుతారని హితవు పలికారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates