జగన్‌ పై ఎంపీలు దండెత్తబోతున్నారా?

ఏడాది నుంచి అదే పనిగా తనను, తన ప్రభుత్వాన్ని, అలాగే తన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వచ్చిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆయన పుట్టిన రోజు నాడే అరెస్టు చేయించడం ద్వారా ఆయనకు గట్టి ఝలక్ ఇచ్చాననుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరెస్టుతో సరిపెట్టుకుండా కస్టడీలో ఉన్నపుడు రఘురామను పోలీసులు హింసించినట్లుగా ఆర్మీ ఆసుపత్రిలో నిర్ధారణ కావడం, దీనిపై ముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్య కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా తేలడంతో జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పేలా లేవు.

రఘురామ మీదికి సీఐడీని ఉసిగొల్పితే ఆయన నోరు మూతపడుతుందని అనుకున్నారు కానీ.. అలా జరక్కపోగా జగన్ సర్కారును రఘురామ మరింతగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ఎంపీని పుట్టిన రోజు నాడు అరెస్టు చేయడం, ఆయన పై భౌతిక దాడి జరిగినట్లు సుప్రీం కోర్టే నిర్ణయించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

రఘురామ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా రెండు రోజుల కిందటే ఆయన దేశంలోని సహచర ఎంపీలందరికీ తనకు జరిగిన అన్యాయంపై లేఖ రాశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ విమర్శలు చేసినందుకు తన పై ఎలా కక్ష గట్టి పుట్టిన రోజు నాడు అరెస్టు చేయించారో, తనను ఎలా హింసించారో అందులో వివరించారు. గత రెండేళ్లలో జగన్ సర్కారుకు 150 సార్లు కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. తనపై రాజద్రోహం కింద కేసులు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ.. రేప్పొద్దున ఏ ఎంపీకైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తవచ్చని, కాబట్టి సహచర సభ్యులు ఇలాంటి విషయాలను ఖండించాలని కోరారు.

ఆయన లేఖపై వరుసగా ఎంపీలు ఒక్కొక్కరు స్పందిస్తుండటం గమనార్హం. ఒకప్పటి టాలీవుడ్ కథానాయిక, ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సుమలత అంబరీష్ ముందుగా ఈ లేఖ స్పందించారు. జగన్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఒక ఎంపీ పట్ల ఇలా వ్యవహరించడం షాక్‌కు గురి చేసిందన్నారు. తన పూర్తి మద్దతు రఘురామకు ఉందని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే ఏపీ పోలీసులు, ప్రభుత్వం ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బ తింటుందని హెచ్చరించారు.

అలాగే మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం రఘురామ లేఖ ప్రతిని జత చేస్తూ ట్వీట్ వేశారు. జగన్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రఘురామకు మద్దతు పలికారు. ఇలా మరికొందరు ఎంపీలు గళం విప్పి, ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తితే జగన్ సర్కారుకు తీవ్ర ఇబ్బందిరక పరిస్థితులు తలెత్తడం ఖాయం.