ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె తన పార్టీ పేరు కూడా కన్ఫార్మ్ చేశారు. తమ పార్టీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) అనే పేరును ఆమె ఖరారు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోగా.. ఆమోదం కూడా లభించినట్టు తెలిసింది.
కాగా.. ఈ పార్టీకి ఆమె అనుచరుడు రాజగోపాల్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. తాను అధ్యక్షుడిగా.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం గత ఏడాది డిసెంబరులో దరఖాస్తు చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర సర్టిఫికెట్‌నూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కొత్త పార్టీల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. వైటీపీకి సీహెచ్ సుధీర్‌కుమార్ ప్రధాన కార్యదర్శిగా, నూకల సురేష్ కోశాధికారిగా వ్యవహరిస్తామంటూ ఆ దరఖాస్తులో పేర్కొన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. పార్టీ రిజిస్ట్రేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోగా తమకు తెలియజేయాలని సూచించింది.
కాగా.. వాడుక రాజగోపాల్ ప్రస్తుతం షర్మిల ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజగోపాల్ సోదరి, షర్మిల చిన్ననాటి స్నేహితులని లోట్‌సపాండ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసీ నుంచి అధికారికంగా లేఖ వచ్చిన తర్వాత షర్మిలను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం లాంఛనమేనని ఆ వర్గాలు తెలిపాయి. జూలై 8న వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ పేరును షర్మిల అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.