బీజేపీకి బెంగాల్లో షాక్ తప్పదా ?

వరస వివాదాలతో నరేంద్రమోడి-మమతాబెనర్జీ మధ్య గొడవలు పెరిగిపోతున్న సమయంలోనే బీజేపీకి పెద్ద షాక్ తప్పదని అనిపిస్తోంది. అదేమిటంటే కమలంపార్టీ తరపున గెలిచిన 8 ఎంఎల్ఏలతో పాటు నలుగురు ఎంపిలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ మీడియాకు చెప్పారు. అయితే వీరి చేరికపై పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఘోష్ చెప్పారు.

ఒక విధంగా కునాల్ ప్రకటనలో వాస్తవం ఉండేఉంటంది. ఎందుకంటే ఇప్పటి రాజకీయాల్లో పార్టీల సిద్ధాంతాలకన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. పార్టీలకే సిద్ధాంతాలు లేకపోతే ఇక నేతల్లో సిద్ధాంతాలను పాటించే వాళ్ళు ఎంతమందుంటారు ? ఇప్పటి పార్టీలది లేకపోతే నేతల సిద్ధాంతాలు ఒకటే. అదేమిటంటే అధికారపార్టీలో ఉండటమే. అధికారంలో లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు చాలామంది నేతలు.

ఎందుకంటే నేతల్లో ఎక్కువమంది కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్ధల వాళ్ళు, వ్యాపారాలున్న వాళ్ళే కాబట్టి. పై రంగాల్లోని వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు కాబట్టి తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవటానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. బెంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ కు చెందిన 29 మంది ఎంఎల్ఏలు, నలుగురు ఎంపిలను బీజేపీ ఒత్తిడిపెట్టే లాక్కుంది. అప్పట్లో అవసరాలను బేరీజు వేసుకుని వాళ్ళు కూడా బీజేపీలో చేరారు.

అయితే బీజేపీతో పాటు ఫిరాయింపుల అంచనాలు దారుణంగా ఫెయిలయ్యాయి. వాళ్ళ అంచనాలకు భిన్నంగా మమతాబెనర్జీనే ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ విజయం సాధించారు. దాంతో పిరాయింపుదారుల్లో పునరాలోచన వచ్చిందని అంటున్నారు. పైన చెప్పినట్లు 8 మంది ఎంఎల్ఏలు, నలుగురు ఎంపిలే కాకుండా మాజీ ఎంఎల్ఏ సోనాలీ గుహతో పాటు పలువురు నేతలు దీపేందు బిస్వాస్, సరాలా ముర్ము, అమల్ ఆచార్య తృణమూల్లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రచారమే గనుక నిజమైతే నరేంద్రమోడికి పెద్ద షాకనే చెప్పాలి.