కరోనా వైరస్ నేపధ్యంలో అనుసరిస్తున్న విధానాలపై కేంద్రప్రభుత్వాన్ని సుప్రింకోర్టు ఉతికి ఆరేసింది. ఇదే విషయమై సోమవారం జరిగిన విచారణలో సుప్రింకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది కేంద్రం. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు, కోవిన్ యాప్ పనితీరు అంశాలపై సుప్రింకోర్టు కేంద్రాన్ని నిలదీసింది.
అయితే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో కానీ కోవిన్ యాప్ పనితీరు, టీకాల ధరలను సమర్ధించుకునేందుకు కేంద్రం ప్రయత్నించినా సుప్రింకోర్టు ముందు పప్పులుడకలేదు. మొదటగా కోవిన్ యాప్ పనితీరుపై కోర్టు మండిపడింది. వలసకూలీలు, గ్రామీణ ప్రాంతాల జనాలు కోవిన్ యాప్ ను ఏ విధంగా ఉపయోగించుకోగలరో చెప్పాలని నిలదీసింది.
ధరల విషయమై మాట్లాడుతు టీకాల ధరల్లో రెండు ధరలెందుకని ప్రశ్నించింది. ఉత్పత్తి కంపెనీలు కేంద్రానికి ఒకధర, రాష్ట్రాలకు మరో ధర ఎందుకు నిర్ణయించాయని నిలదీసింది. టీకాల కొనుగోలు బాధ్యత కేంద్రానిదే అయినపుడు ఆ బాధ్యత నుండి కేంద్రం తప్పుకుని రాష్ట్రాలపై వదిలేసిన వైనాన్ని దుమ్ముదులిపేసింది. కరోనా వైరస్ జాతీయవిపత్తు అయినపుడు టీకాల కొనుగోలును కేంద్రమే కదా చేపట్టాల్సిందన్న ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పలేకపోయింది.
అలాగే వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్ళాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. ఉత్పత్తి కంపెనీల్లో ఒక్కటి కూడా గ్లోబల్ టెండర్లకు స్పందచలేదన్న విషయాన్ని గుర్తుచేసింది. ఏ సంస్ధఅయినా తాము కేంద్రంతో మాత్రమే సంప్రదింపులు చేస్తామనని నేరుగా రాష్ట్రాలకు టీకాలను సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పిన విషయం కేంద్రానికి తెలుసా అంటూ ప్రశ్నించింది.
45 ఏళ్ళు దాటిని వాళ్ళకు కేంద్రం ఉచితంగా టీకాలు ఇవ్వటం ఏమిటి ? 18-45 మధ్య వయస్సున్న వారికి రాష్ట్రాలే టీకాల కోసం ధరలు నిర్ణయించుకోవాలని కేంద్రం చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. కంపెనీల నుండి కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి అన్నీ వయసుల వాళ్ళకి ఉచితంగా ఎందుకు వేయకూడదని నిలదీసింది. విచారణలో సుప్రింకోర్టు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా కేంద్రం సమాధానం చెప్పలేకపోయింది.