కేసీఆరా మజాకానా.. నెక్లెస్ రోడ్ అనే మాట ఇక వినిపించదు

సమయానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవటం.. ఏదైనా అంశంలో ఒకసారి కమిట్ అయితే.. దానికి తగ్గట్లు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాదీయులకు సుపరిచితమైన నెక్లెస్ రోడ్ అనే మాట రానున్న రోజుల్లో వినిపించే అవకాశమే లేదు. ఎందుకంటే.. ఆ రోడ్డుకు పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్.

ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా ముందుకు వచ్చి.. నాలుగు కూడలి రోడ్డులో ముందుకు వెళితే సెక్రటేరియట్.. కుడి వైపునకు తిరిగితే ప్రసాద్ ఐమ్యాక్స్.. ఎడమ వైపునకు తిరిగితే ఐదున్నర కిలోమీటర్ల నిడివి ఉండే నెక్లెస్ రోడ్ తెలిసిందే. ఇప్పటికి పెద్దగా వాహనాల రద్దీ లేకుండా.. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించే నెక్లెస్ రోడ్డుకు అనూహ్యమైన పేరును డిసైడ్ చేశారు కేసీఆర్.

ఇటీవల కాలంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దత్తత తీసుకున్నట్లుగా వ్యవహరిస్తున్న గులాబీ బాస్.. ఇప్పటికే పీవీ శత జయంతిని ఘనంగా చేపట్టేందుకు వీలుగా పలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ మధ్యన హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పీవీ కుమార్తెకు టికెట్ ఇవ్వటమే కాదు.. ఆమెను విజయ పథాన నడిచేలా చేయటంలో కీలకంగా వ్యవహరించారు కేసీఆర్. నిజానికి ఆయన ఆ ఎన్నికను వ్యక్తిగతంగా తీసుకొని ఉండకపోతే.. ఫలితం మరోలా ఉండేది.

పీవీని పట్టించుకోని కాంగ్రెస్ కు షాకిస్తూ.. తాము పీవీని నెత్తిన పెట్టుకుంటామని చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయంతో పీవీ పేరు నానేలా చేసే కేసీఆర్.. తాజాగా నెక్లెస్ రోడ్డుకు పీవీ నరసింహారావు పేరును పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నెక్లెస్ రోడ్డుకు బదులుగా.. పీవీ నరసింహారావు మార్గ్ గా పిలవనున్నారు. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో తీర్మానం చేశారు. ఈ నెక్లెస్ రోడ్డులోనే ప్రభుత్వం పీవీ ఘాట్ ను నిర్మించింది. పీవీ పేరును రాజకీయ అవసరాలకు మాత్రమే కేసీఆర్ వాడుకుంటున్నారంటూ టీ కాంగ్రెస్ నేతల విమర్శల్లో పస లేదన్న విషయాన్ని తాజా నిర్ణయంతో తేల్చేశారని చెప్పాలి కేసీఆర్.