నిజంగానే ఇవన్నీ పూర్తవుతాయా ?

రాష్ట్రంలో కొత్తగా 14 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి శంకుస్ధాపన చేస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండే వర్చువల్ పద్దతిలో సోమవారం శంకుస్ధాపన చేయబోతున్నారు సీఎం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల, పాడేరులో ఇప్పటికే మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా కొత్తగా 14 కాలేజీలను ఏర్పాటు చేయాలన్న జగన్ నిర్ణయానికి అనుగుణంగానే శంకుస్ధాపనలు జరుగుతున్నాయి.

వైద్యావసరాల కోసం ప్రజలు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదనే మెడికల్ హబ్ ల ఏర్పాటుకు జగన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రతిజిల్లాలోను ఆసుపత్రుల ఏర్పాటుకు ఆహ్వానిస్తు ప్రముఖ ఆసుపత్రుల యాజమాన్యాలను ఇప్పటికే ప్రభుత్వం ఆహ్వానించింది. మూడేళ్ళల్లో వంద కోట్లరూపాయలు పెట్టుబడులు పెట్టేవాళ్ళకు 5 ఎకరాలను ఉచితంగా ఇవ్వనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.

మెడికల్ హబ్ ల ఏర్పాటు కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 14 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నది. అలాగే మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయబోతున్నది. 8 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలు 2023 కల్లా పూర్తవ్వాలనే టార్గెట్ పెట్టుకున్నది.

విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ళ, మదనపల్లె, పెనుకొండ, ఆదోని, నంద్యాలలో జరగబోయే శంకుస్ధాపనలతో దాదాపు అన్నీ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటవబోతున్నాయి. ఇప్పటికే తిరుపతి, కాకినాడ, వైజాగ్, విజయవాడ లాంటిచోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తోడు ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. ప్రతి మెడికల్ ఆసుపత్రిలో 500 కు తగ్గకుండా పడకలు కూడా ఏర్పాటవుతున్నాయి. నిజంగానే ప్రభుత్వం అనుకుంటున్నట్లు 2023కి కాలేజీలు, నర్సింగ్ కాలేజలు ఏర్పాటైతే జనాలందరికీ వైద్యం అందుబాటులోకి వస్తుంది.