మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజకీయం ఢిల్లీకి మారింది. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన దగ్గర నుండి హైదరాబాద్ లోనే చాలా రోజులు బిజీబిజీగా గడిపేసిన ఈటల ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తన మద్దతుదారులతో ముందు మంతనాలు జరిపారు. తర్వాత టీఆర్ఎస్ తరపున రాజ్యసభ ఎంపి అయి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలీని డీ శ్రీనివాస్ తో భేటి జరిపారు.
ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతోను, బీజేపీ సీనియర్లతో కూడా సమావేశమయ్యారు. ఇవన్నీ చాలవన్నట్లు ప్రజాసంఘాల నేతలు, తర్వాత టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్+మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డితో ఏకాంత చర్చలు జరిపారు. ఇన్ని పార్టీల నేతలతో సమావేశమైన ఈటల చివరకు ఏ పార్టీలో చేరాలనే విషయంలో అయోమయంలో పడినట్లుంది.
అందుకనే తానే కొత్తపార్టీ పెడితే పోలేదా అని కూడా ఆలోచించినట్లు ప్రచారం జరిగింది. ఏదేమైనా రకరకాల సమావేశాలు, భేటీలు, మద్దతుదారులతో చర్చల తర్వాత చివరకు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ కోసమని ఈ మాజీమంత్రి ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. ఎందుకంటే తనను కలవాలని ఈటల అపాయిట్మెంట్ అడిగినట్లు స్వయంగా కిషన్ రెడ్డే చెప్పారు కాబట్టి.
తాజా సమాచారాన్ని బట్టి కమలంపార్టీలో చేరటానికే ఈటల నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోత్సాహం, చొరవ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బండి చొరవ తీసుకుని ఈటల వ్యవహారాన్ని ఢిల్లీ నేతలతో చర్చలు జరిపినపుడు సానుకూల వాతావరణం కనిపించిందట. ఆ విషయాన్ని బండి మాజీమంత్రితో చెప్పిన తర్వాతే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినట్లు చెప్పుకుంటున్నారు. మరి కిషన్ తో భేటీ తర్వాత ఎలాంటి డెవటప్మెంట్ ఉంటుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates