రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు ఇప్పుడో సంచలనంగా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసింది. ఏపీకి చెందిన నేతలు ఆనందయ్య మందుపై సానుకూలంగా స్పందిస్తున్నారు. అధికార.. విపక్షాలకు చెందిన నేతలంతా ఆయన మందుపై సానుకూల ప్రకటనలు చేసే విషయంలో పోటీ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సైతం ఆనందయ్య మందుపై శాస్త్రీయంగా లెక్క తేల్చే విషయంలో సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటోంది.
సానుకూల ఫలితాలు వస్తే.. టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మందును తయారు చేసేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటివేళ.. ఆనందయ్య మందుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు. మిగిలిన వారికి భిన్నంగా జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనాను నయం చేసేలా పని చేస్తే.. ఆయనకు పాదాభివందం చేస్తానని చెప్పారు. కళ్లల్లో ఆనందయ్య మందు వేస్తే కళ్లకు ప్రమాదమన్నారు. ఆ మందు వేస్తే కళ్లకు ప్రమాదం.. కళ్ల మంట తప్పించి కరోనా పోదన్నారు. ఆనందయ్య మందు పని చేస్తే కరోనా రోగులకు ఆ మందును పంపిణీ చేయొచ్చన్నారు. అనవసరమైన మూఢనమ్మకాలకు పోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీలో ఆనందయ్య మందుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఇష్టపడని తీరుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉండటం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates