ఎవరు ఎవరికి గాలమేస్తున్నారు ?

ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. టీఆర్ఎస్ ఎంఎల్ఏ, మంత్రివర్గం నుండి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ విషయమే ఆసక్తిగా మారుతోంది. టీఆర్ఎస్ లో ఉంటునే భవిష్యత్తు అడుగులు ఎటు వేయాలనే విషయమై చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు రాజ్యసభ ఎంపి డీ శ్రీనివాస్ లాంటి వారిని కలిశారు.

తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు కమలంపార్టీ స్ధానిక నేతలతో భేటీలు జరిపారు. ఒకదశలో పార్టీకి తాను రాజీనామా చేసేయబోతున్నట్లు ఈటల కలరింగ్ కూడా ఇచ్చారు. అయితే కరోనా ఉధృతి కారణంగా రాజీనామా చేయటం లేదని మద్దతుదారులు ప్రకటించారు. కొంతకాలం కేవలం మద్దతుదారులతో మాత్రమే మంతనాలు జరిపిన మాజీమంత్రి మళ్ళీ హఠాత్తుగా భేటీల స్పీడుపెంచారు.

ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అయిన ఈటల సికింద్రాబాద్ ఎంపి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అండ్ కో తో భేటీ అవబోతున్నారు. ఈ విషయాన్ని కిషన్ కూడా ధృవీకరించారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలూ ఈటకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇదే సమయంలో తన మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని మాజీమంత్రి ఏ సంగతి చెప్పకుండా దాటవేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈటలకు బలమైన పార్టీ అవసరముంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలకు బలమైన బీసీ నేత అవసరముంది. దాంతో పార్టీలకు ఈటల అవసరముందా ? లేకపోతే ఈటలకే పార్టీ అవసరముందా ? అనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎవరు ఎవరికి గాలమేస్తున్నారనే విషయం అమోయంగా మారింది. చూద్దాం కొద్దిరోజుల్లోనే అయోమయం క్లియర్ అయిపోవచ్చేమో.