ఈ విషయంలో వైసీపీ, టీడీపీలు ఏకమయ్యాయా ?

కృష్ణపట్నం ఆనందయ్య విషయంలో రాష్ట్రంలోని మెజారిటి రాజకీయపార్టీలు ఏకమైనట్లే అనిపిస్తోంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు సీపీఐ కూడా ఆనందయ్య నాటు లేదా ఆయుర్వేదం వైద్యాన్ని తక్షణమే కంటిన్యు చేయాలంటు డిమాండ్ చేస్తున్నాయి. మాములుగా ఏ విషయంలో కూడా అధికార వైసీపీకి ప్రతిపక్షాలకు మధ్య చుక్కుదురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఆనందయ్య మందు విషయంలో మాత్రం రెండు పార్టీలు ఏకమయ్యాయి. వీళ్ళకు సీపీఐ కూడా తోడయ్యింది.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత జనాలపై ఏ స్ధాయిలో ప్రభావం చూపిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షలు పోసి కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించినా బతుకుతారనే ఆశలు కనబడటంలేదు. ఒకవైపు టీకాలు అందరికీ అందక మరోవైపు రోగులకు బెడ్లు, ఆక్సిజన్ అందక జనాలు అల్లాడిపోతున్నారు. వందలసంఖ్యలో రోగులు అంబులెన్సుల్లోనే ప్రాణాలు వదిలేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆయుర్వేదం వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న చుక్కల మందు కరోనా రోగులపైన బాగా పనిచేస్తోందంటు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇంకేముంది జనాలు ఒక్కసారిగా కృష్ణపట్నానికి క్యూ కట్టారు. ఆనందయ్య మందుకోసం తమిళనాడు, తెలంగాణా, కర్నాటక, మహారాష్ట్రల నుండి కూడా వేలాదిమంది రోగులు, మామూలు జనాలు పోటెత్తారు. దాంతో గందరగోళం మొదలైపోయింది.

ఆనందయ్య మందుకు పోటెత్తిన జనాలను చూసి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకున్నది. వెంటనే మందు పంపిణిని నిలిపేసింది. ఐసీఎంఆర్, ఆయుష్ తదితర సంస్ధల ద్వారా పరీక్షలు చేయించింది. ఆనందయ్య ఇస్తున్న మందులు బాగా పనిచేస్తున్నట్లు రోగులు, జనాలు చెప్పుకుంటున్నారు. ప్రజా స్పందన చూసిన తర్వా ఆనందయ్య మందుకు ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. అందుకే దానికి ప్రభుత్వ సంస్ధల ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇప్పించాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారట.

సరిగ్గా ఇక్కడే ఆనందయ్య చుక్కల మందుకు వైసీపీ మద్దతుగా నిలిచింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు, సీపీఐ కూడా మద్దతు పలికారు. అధికారికంగా సీపీఎం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ స్పందించలేదు. బహుశా మరో వారంరోజుల్లో ఆనందయ్య మందు జనాలకు అందుబాటులోరి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా జనాలందరు నమ్మకం పెట్టుకున్న ఆనందయ్య మందు విషయంలో రాజకీయం చేయకుండా ప్రధాన పార్టీలు ఏకమవ్వటం సంతోషించతగ్గదే.