గవర్నర్లపై ముఖ్యమంత్రుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గవర్నర్ జగదీప్ థడకర్ కు మధ్య వ్యవహారం ఉప్పునిప్పులాగ తయారైంది. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ హోషియారీ వ్యవహారంపై శివసేన ప్రభుత్వం మండిపోతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ ఎంపి సంజై రౌతు హోషియారీ పై తీవ్రంగా ధ్వజమెత్తటమే ఇందుకు నిదర్శనం.
గవర్నర్లను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ రాష్ట్రాల పై పెత్తనం చెలాయించాలని చూస్తోందనే ఆరోపణలు రోజు రోజుకు పెరిగిపోతోంది. తమ ఆటలు సాగని రాష్ట్రాల్లో గవర్నర్లను ముందు పెట్టుకుని వ్యవహారం నడిపిద్దామని మోడి చూస్తున్నారంటు మమత బెనర్జీ ఇప్పటికే నానా రచ్చ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉదంతం చూసిన తర్వాత మమత చేస్తున్న రచ్చ నిజమే అనిపిస్తోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే 12 మందిని ఎంఎల్సీలుగా నామినేట్ చేయాలంటు ముఖ్యమంత్రి దగ్గర నుండి పోయిన నవంబర్లో గవర్నర్ హోషియారీకి ఫైల్ చేరింది. మామూలుగా సీఎం దగ్గర నుండి ఫైల్ వస్తే గవర్నర్ ఒకటిరెండు రోజుల్లో సంతకాలు పెట్టి క్లియర్ చేసేస్తారు. అలాంటిది హోషియారీ ఆ ఫైల్ ను పోయిన నవంబర్ నుండి ఇప్పటివరకు క్లియర్ చేయకుండా అట్టే పెట్టేసుకున్నారు. ఈ విషయంలో రౌత్ మండిపోతు సదరు ఫైల్ పై గవర్నర్ ఏమన్నా పీహెచ్డీ చేస్తున్నారా అంటు ఎద్దేవా చేశారు.
బెంగాల్లో కూడా మమతతో సంబంధం లేకుండానే గవర్నర్ ధడకర్ తనిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. నారదా స్కాంలో నిందితులనే కారణంతో మమతకు చెప్పకుండానే ఇద్దరు మంత్రులపై సీబీఐ విచారణకు గవర్నర్ ఆర్డరేయటం పెద్ద దుమారాన్నే రేపుతోంది. గవర్నర్ ను అడ్డుపెట్టుకుని కేంద్రం బెంగాల్లో మమతను బాగా ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
ఇక పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు అక్కడి గవర్నర్ కిరణ్ బేడి దాదాపు సమాంతర ప్రభుత్వాన్నే నడిపారు. ప్రతిరోజు ముఖ్యమంత్రికి గవర్నర్ కు రచ్చే రచ్చ. అలాగే ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కాదని లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను అడ్డం పెట్టుకుని కేంద్రం సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇలాంటి రాజకీయాలు చేస్తోంది కాబట్టే మోడి సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేతలు తెలుసుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates