కొన్నిరోజులుగా హైదరాబాదులో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తుంటే… మరోవైపు రూరల్ తెలంగాణ కరోనా ఫ్రీ గా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులపై కేసీఆర్ మంత్రులు ఉన్నతాధికారులో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కరోనా ప్రధానంగా ఈ చర్చ జరిగినా… రానున్న వానాకాలంలో దీని విజృంభణకు అడ్డుకట్ట వేయడం అనేది మరో ప్రధాన అజెండాగా ఉంది. ఈ మీటింగ్ లో కేసీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తెలంగాణ మొత్తం కరోనా ఫ్రీగా మారిపోయిందని… హైదరాబాదులో కూడా కేవలం 4 జోన్లలో మాత్రమే కరోనా విజృంభణ ఉందని కేసీఆర్ వివరించారు. అది కూడా 1442 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్లో ఉన్నాయన్నారు. ఈ నాలుగు జోన్లు కార్వాన్, చార్మినార్, మలక్ పేట, ఎల్బీనగర్; రూరల్ తెలంగాణలో యాదాద్రి, జనగామ, మంచిర్యాల జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసపోయి తాజాగా రైళ్లలో తిరిగి వచ్చిన కూలీలకు మాత్రమే కరోనా సోకిందని… స్థానికంగా ఏ కేసులు లేవన్నారు. గ్రామీణ తెలంగాణకు కరోనా సోకకుండా ఈ కూలీలకు హైదరాబాదులోనే చికిత్స అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.
దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా మన వద్ద అదుపులోనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సీజనల్ వ్యాధులు కరోనాకు తోడైతే ప్రమాదంగా మారే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. కంగారు పడాల్సిన పరిస్థితిలో మనం లేమని, దేశ సగటు డెత్ రేటు 3.5 కాగా, మన తెలంగాణలో అది 2.38 మాత్రమే అన్నారు. తెలంగాణ 29వరకు లాక్ డౌన్ ప్రకటించినా కేంద్ర మార్గదర్శకాలు 17 తర్వాత విడుదలయ్యాక దాన్ని బట్టి సడలింపులను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతానికి రేపటి నుంచి కొన్ని దుకాణాలకు సడలింపులు ఉంటాయన్నారు.
కొత్తగా అనుమతించిన దుకాణాలు ఇవే
1.ఆటోమొబైల్ షాపులు, షోరూములు
2.ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు
3.ఏసీ దుకాణాలు
4.ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయి
తాజాగా గుర్తించి అమలు చేస్తున్న జాగ్రత్తలు
- విదేశాల నుంచి తెలంగాణ వచ్చే ఇతర రాష్ట్రాల ప్రజలను ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వారి సొంత ప్రాంతాలకు పంపాలి.
- ఇతర రాష్ట్రాల కూలీలను కూడా ఎయిర్ పోర్టు నుంచి వారి స్వంత రాష్ట్రాలకు పంపాలి.
- దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చే తెలంగాణకు చెందని ప్రతి కూలీకి పరీక్ష నిర్వహించి హైదరాబాదులోనే చికిత్స ఇవ్వాలి.
- నెగిటివ్ వచ్చినా హోం క్వారంటైన్లో ఉంచాలి.