కొవాగ్జిన్ వేసుకుంటే విదేశాలకు వెళ్లలేరా?

మీరు ఏ వ్యాక్సిన్ వేసుకుంటారన్నంతనే చాలామంది నోటి నుంచి కొవాగ్జిన్ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకలా? అంటే సూటి కారణం చెప్పలేరు కానీ.. చాలామంది అదే మాట చెబుతున్నారు కదా? అన్న అర్థం లేని సమాధానం చాలామంది నోటి నుంచి వస్తుంది. ఏ వ్యాక్సిన్ మంచిది.. ఏ వ్యాక్సిన్ కాదన్న దానిపై చర్చ పలు రకాలుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకునే వారికి ఇప్పుడు ఊహించని ఇబ్బంది ఎదురవుతుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. అదేమంటే.. కొవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్న వారు అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేరన్న మాట వినిపిస్తోంది.

అదెలా? అన్న సందేహం కలుగుతుందా? దానికి కారణం లేకపోలేదు. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న వాటిని మాత్రమే పలు దేశాలు ప్రామాణికంగా భావిస్తున్నాయి. వారి జాబితాలో ఉన్న వ్యాక్సిన్ వేసిన వారిని మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందన్న విషయాన్ని గుర్తించి.. వారిని తమ దేశాల్లోకి అనుమతిస్తున్నారు. అయితే.. కొవాగ్జిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో లేకపోవటం ఇప్పుడో సమస్యగా మారింది.

కొవాగ్జిన్ ను డబ్ల్యూహెచ్ వో అత్యవసర వినియోగ జాబితాలో చేర్చకపోవటంతో.. ఈ వ్యాక్సిన్ వేసుకునే వారికి అంతర్జాతీయ ప్రయాణాలకు అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. భారత్ బయోటెక్ నుంచి తమకు వినతులు అందాయని.. కాకుంటే.. తాము ఆ వ్యాక్సిన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని కోరామని.. ఆ వివరాలు రావాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెబుతున్నారు.

దీంతో.. కొవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్న వారిని.. పలు దేశాలు వారిని వ్యాక్సిన్ వేసుకోని వారిగానే పరిగణించే వీలుందని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న వ్యాక్సిన్లు..

  • సీరం సంస్థ వారి కోవిషీల్డ్
  • అస్ట్రాజెనెకా
  • మోడెర్నా
  • ఫైజర్
  • జాన్సన్ అండ్ జాన్సెస్ (కొన్ని దేశాల్లోనే వినియోగిస్తున్నారు)
  • సినోఫాం (కొన్ని దేశాల్లోనే వినియోగంలో ఉంది)