ప్రధాని నరేంద్ర మోడీని మీడియా వాళ్లు, అటు సోషల్ మీడియా జనాలు మోసే రోజులు పోయినట్లే ఉంది. వరుసగా రెండు పర్యాయాలు ఎన్డీఏ సర్కారును అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానిగా ఏడేళ్ల పాటు ఎదురే లేకుండా సాగిపోయిన ఆయన.. ఇప్పుడు ఊహించని స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి కొత్తగా దేశంలోకి అడుగు పెట్టింది కాబట్టి మోడీ సర్కారు ఎవరూ పెద్దగా నిందించలేదు. ఈ అనుభవం అందరికీ కొత్త కాబట్టి ఊరుకున్నారు. నిజానికి అంతకుముందు డీమానిటైజేషన్ సహా అనేక అంశాల్లోనూ మోడీ సర్కారు వైఫల్యంపై మరీ వ్యతిరేకత ఏమీ రాలేదు. మీడియా కూడా దాన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు.
కానీ కరోనా సెకండ్ వేవ్ గురించి హెచ్చరికలు వచ్చినా పట్టించుకోకుండా ఎన్నికల హడావుడిలో మునిగిపోయిన మోడీ.. దేశాన్ని కల్లోలంలోకి నెట్టాడనే అభిప్రాయం ఇప్పుడు జనాల్లో బలంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ మీడియా మోడీని గట్టిగా టార్గెట్ చేయడం.. దేశీయ మీడియా కూడా దాన్ని అందిపుచ్చుకుని ఆయనపై మునుపెన్నడూ లేని స్థాయిలో విమర్శిస్తుండటం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో మోడీ కనిపిస్తే చాలు.. నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. భాజపా ఐటీ సెల్ వాళ్లు ఎంతగా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకపోతోంది.
తాజాగా కొవిడ్, బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోతున్న వారి పట్ల మోడీ సంతాపం వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి గురి కావడం, కన్నీళ్లు పెట్టుకోవడం తెలిసిందే. దీని ద్వారా జనాల్లో తన పట్ల సానుకూల అభిప్రాయం తేవాలని మోడీ అనుకున్నారు కానీ.. అది తిరగబడినట్లే ఉంది. మోడీ ఈ వీడియోలో అద్భుతంగా నటించాడని, మొసలి కన్నీరు కార్చారని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు.
సరిగ్గా మోడీ కన్నీళ్లు పెట్టుకునే సమయానికి కెమెరా జూమ్ కావడం.. మోడీ పెదవులు వణకడం, కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపించడం.. ఇదంతా సెటప్పే అని విమర్శిస్తున్నారు. కాగా ఈ వీడియోలోని విజువల్స్ తీసుకుని మోడీకి ఆస్కార్ అవార్డు ప్రకటిస్తున్నట్లుగా తీర్చిదిద్దిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఇలాంటి మరిన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. #PMcries అంటూ ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ కొట్టి చూస్తే ఇలాంటి వీడియోలు బోలెడన్ని కనిపిస్తాయి.