ఆక్సిజన్ లో కూడా దెబ్బకొట్టిన మోడి సర్కార్

రాష్ట్రవసరాలను నరేంద్రమోడి సర్కార్ ఏమాత్రం పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతునే ఉంది. తాజాగా ఆక్సిజన్ సరఫరాలో కోత విధించటమే నిదర్శనం. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) అంటే అందరికీ అర్ధం కాకపోవచ్చు. కానీ వైజాగ్ స్టీల్స్ అంటే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేస్తుంది. వైజాగ్ స్టీల్స్ ప్రతిరోజు భారీఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. అయితే ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ మొత్తాన్ని మన రాష్ట్రంలోనే ఉపయోగించుకునేందుకు లేదు. ఎందుకంటే ఈ సంస్ధ కేంద్రానికి కాబట్టి కేటాయింపులు కూడా కేంద్రమే చేస్తుంది.

ఇప్పటివరకు కరోనా రోగుల్లో ఆక్సిజన్ అవసరమైన వారిని ఆదుకుంటున్న వైజాగ్ స్టీల్స్ నుండి ఇకముందు సాయం తగ్గిపోతోంది. వైజాగ్ స్టీల్స్ నుండి ఇప్పటి వరకు రోజుకు 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రవాసరాలకు అందుతోంది. ఇకనుండి కేవలం 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అంటే ఒక్కసారిగా 70 మెట్రిక్ టన్నులను కోత విదించేసింది. ఒక్కసారిగా 70 మెట్రిక్ టన్నులను తగ్గించేసిందంటే మామూలు విషయంకాదు.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందక కొన్ని వందలమంది రోగులు చనిపోయిన విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 11 మంది చనిపోయారు. హిందుపురం ఆసుపత్రిలో కూడా ఐదుగురు చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తమిళనాడు నుండి వస్తున్న ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయింది.

దీనికి ప్రత్యామ్నాయంగా నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, కృఫ్ణా, వైజాగ్, ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి చిన్న చిన్న ప్లాంట్లను పెట్టినా అవి ఉత్పత్తిచేసే ఆక్సిజన్ స్ధానిక అవసరాలకు మాత్రమే సరిపోతుంది. అందుకనే బళ్ళారి, తమిళనాడు, ఒడిస్సా, మహారాష్ట్ర నుండి అందుతున్న ఆక్సిజన్ కోటాను పెంచమని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

ఒకవైపు కోటాను పెంచమని కోరుతునే మరోవైపు రాష్ట్రంలోనే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచేందుకు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఏదేమైనా ఒక్కసారిగా 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తగ్గించయటమంటే దారుణమనే చెప్పాలి.ఆక్సిజన్ లో కూడా దెబ్బకొట్టిన మోడి సర్కార్