బెంగాల్‌లో ఏం జ‌రుగుతోంది?


దేశ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడిపోతుంటే.. బెంగాల్‌లో మాత్రం ఈ వైర‌స్ క‌ల్లోలం కంటే రాజ‌కీయ ప‌ర‌మైన ర‌గ‌డే చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా దేశం దృష్టిని ఆక‌ర్షించిన అక్క‌డి రాజ‌కీయ వైరం.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కూడా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు.

మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి రాగానే.. ప్రధాన ప్ర‌తిప‌క్షం బీజేపీకి చెందిన కార్య‌కర్త‌ల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం.. ఆ పార్టీ వాళ్లు దాదాపు ప‌దిమంది దాకా ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిందే. ఈ హింస ఇలా కొన‌సాగుతుండ‌గానే.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌మ‌త స‌ర్కారును టార్గెట్ చేసింది. ఎప్ప‌ట్నుంచో నానుతున్న‌ నారద టేపుల వ్యవహారాన్ని మ‌ళ్లీ బ‌య‌టికి తీసింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న‌లుగురు మంత్రులను సీబీఐ అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు. సీబీఐ ఆఫీస్ ముందు అయితే ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సీబీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. మంత్రులను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సీబీఐ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.

నిబంధనలు పాటించకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీబీఐ అరెస్టు చేసిన మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా బెనర్జీలతో సహా మరో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రులను అరెస్టు చేసిన ఏడు గంటల్లోనే కోర్టు బెయిలిచ్చింది.