ర‌ఘురామకు సోరియాసిస్ అట‌.. భార్య షాక్


ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాల్లో న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్య‌వ‌హార‌మే హాట్ టాపిక్. ఏడాదిగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ, ప్ర‌భుత్వం మీదే తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ రెబ‌ల్‌గా మారిన ర‌ఘురామను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేయ‌డం తెలిసిందే. రెండు రోజుల కింద‌ట‌ ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం.. త‌ర్వాతి రోజు కోర్టులో హాజ‌రు ప‌రిచిన సంద‌ర్భంగా ఆయ‌న పాదాలు క‌మిలిపోయి క‌నిపించ‌డం.. ర‌ఘురామ‌ను పోలీసులు కొట్టిన‌ట్లుగా ఆయ‌న లాయ‌ర్లు ఆరోపించాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ప్ర‌భుత్వ వైద్యాధికారుల‌ను నివేదిక కోర‌డం తెలిసిన సంగ‌తే. ఐతే ఆదివారం కోర్టుకు స‌మ‌ర్పించిన వైద్యులు.. ర‌ఘురామ‌ను పోలీసులు కొట్టిన‌ట్లుగా ఆధారాలేమీ లేవ‌ని తేల్చిన‌ట్లు స‌మాచారం. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది.

రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని.. రెండు పాదాలు, అరికాలు రంగు మారాయ‌ని.. కానీ బయటికి గాయాలు ఏమీ కనిపించడం లేదని వైద్యులు ఆ నివేదిక‌లో పేర్కొన్నారట‌. అయితే పాదాలు రంగు మార‌డానికి కార‌ణం చ‌ర్మ స‌మ‌స్య అయి ఉండొచ్చ‌ని.. ర‌ఘురామ‌కు సోరియాసిస్ ఉండొచ్చ‌ని వైద్యులు అనుమానం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. రఘురామకు నాలుగున్నర నెలల క్రితం బైపాస్ స‌ర్జ‌రీ జ‌రిగిన నేప‌థ్యంలో ఆయ‌న్ని కార్డియాలజిస్ట్ ద‌గ్గ‌రికీ పంపామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు తమ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.

అయితే ఈ నివేదిక‌కు సంబంధించి ఓ టీవీ ఛానెల్లో చ‌ర్చ జ‌ర‌గ్గా.. ఫోన్ ద్వారా ర‌ఘురామ కృష్ణంరాజు స‌తీమ‌ణి రమాదేవి అందులో మాట్లాడారు. తన భ‌ర్త‌కు సోరియాసిస్ ఉన్న‌ట్లుగా చెప్ప‌డం ప‌ట్ల ఆమె ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం ఇన్నేళ్లలో త‌న‌కు ఎప్పుడూ తెలియ‌లేద‌ని.. అది అబ‌ద్ధ‌మ‌ని ఆమె అన్నారు. త‌న భ‌ర్త‌ను ఆదివారం రాత్రి జైల్లో చంపేందుకు కుట్ర జ‌రిగిన‌ట్లుగా ఈ చ‌ర్చ సంద‌ర్భంగా ఆమె ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.