ఆత్మరక్షణలో పడిపోయిన మోడి

యావత్ దేశం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభంలో కూరుకుపోతున్న సమయంలో నరేంద్రమోడి ఆత్మరక్షణలో పడిపోయారు. సంక్షోభంగురించి, దాని పరిష్కారం గురించి ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడలేని పరిస్దితిలో కూరుకుపోయారు. ఎందుకంటే ప్రస్తుత సంక్షోభం కేవలం మోడి చేతకానితనం వల్లే తలెత్తిందన్న విషయం దేశం మొత్తానికి తెలిసిపోయింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం, బీజేపీలో కూడా పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు.

కరోనా వైరస్ నియంత్రణకు మొదటి దశలో చొరవ చూపించారు. అయితే అప్పుడు కూడా చివరలో ఫెయిలయ్యారు. రాత్రికి రాత్రి లాక్ డౌన్ విధించిన కారణంగా సుమారు 16 కోట్లమంది వలసకూలీలు పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఇదే మోడి మొదటి ఫెయిల్యూర్. అలాగే కుదేలైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ఎంతో ఆర్భాటంగా రు. 20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్ పథకం ఏమైందో ఎవరికీ తెలీదు. ఇది రెండో ఫెయిల్యూర్.

ఇక సెకెండ్ వేవ్ దేశాన్ని ముంచెత్తబోతోందని శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు ముందే హెచ్చరించినా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని హెచ్చరికలను పట్టించుకోకపోవటం మూడో ఫెయిల్యూర్. నిపుణుల హెచ్చరికలను విని మార్చి చివరిలోనే లాక్ డౌన్ విధించేసుంటే సమస్య ఇంతగా ముదిరేదికాదు. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించకుండా ఆ విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయటం మోడి చేతకానితనమే. మోడి ఇచ్చిన వెసులుబాటు కారణంగా ఏ రాష్ట్రం కూడా సంపూర్ణలాక్ డౌన్ విధించలేదు.

ఇక టీకాలు సరఫరా, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా విషయంలో కూడా మోడి ఫెయిల్యూర్ స్పష్టంగా తెలిసిపోతోంది. దీంతో ఏడేళ్ళుగా మీడియా అండతో మోడి నిర్మించుకున్నఇమేజి మొత్తం కుప్పకూలిపోయింది. దీని ఫలితంగా మోడిని ఇపుడు దేశంలోని అన్నీ వర్గాల నుండి ఆరోపణలు, విమర్శలు చుట్టుముట్టేశాయి. తన వైఫల్యాలు కళ్ళముందు కనబడుతున్నాయి కాబట్టే ఎవరికీ సమాధానాలు చెప్పుకోలేక ఆత్మరక్షణలో పడిపోయారు.

ఇంతకుముందులా మోడి ఏమి చెబితే చప్పట్లు కొట్టడంలేదు జనాలు. మోడి రాజీనామాకు ట్విట్టర్లో పెరిగిపోతున్న డిమాండే దీనికి నిదర్శనం. ఎంతో కాలం షో చేస్తు జనాలను మాయ చేయలేరనే విషయం బహుశా మోడికి అర్ధమైపోయుంటుంది. అందుకనే వేరేదారి లేక చివరకు తనమీద వస్తున్న ఆరోపణలు, విమర్శలకు సైతం సమాదానాలు చెప్పుకోలక మౌనాన్ని ఆశ్రయించారు. మరి ఎంతకాలం ఇలాగుంటారో చూడాల్సిందే.