ఘటన జరిగి 48 గంటలు అయిపోయినా రుయా ఆసుపత్రిలో చనిపోయింది ఎంతమంది అనే విషయమై జాబితా వెల్లడికాకపోవటమే విచిత్రంగా ఉంది. మామూలుగా దుర్ఘటన జరిగిన వెంటనే మృతుల జాబితాతో పాటు ఇతరత్రా వివరాలను అధికారయంత్రాంగం ప్రకటించేస్తుంది. అయితే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్యను ప్రకటించిన జిల్లా కలెక్టర్ జాబితాను మాత్రం విడుదల చేయకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ఘటన జరగ్గానే 11 మంది చనిపోయినట్లు కలెక్టర్ హరినారాయణ్ ప్రకటించారు. అంతే మళ్ళీ వాళ్ళ వివరాలను ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదో అర్ధం కావటంలేదు. ఇదే సమయంలో కలెక్టర్ ప్రకటనకు భిన్నంగా ఆసుపత్రిలో చనిపోయిన వారిసంఖ్య 56 మందని కొందరు చెబుతున్నారు. అయితే ఇక్కడో చిన్న మెలికుంది. అదేమిటంటే ఆ అర్ధగంటలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారిసంఖ్య 11 మాత్రమే అని అయితే ఆ తర్వాత అదే రోజు చనిపోయిన వారితో కలుపుకుంటే సంఖ్య 56కి చేరుకుందని చెబుతున్నారు.
ఇక్కడే ఉన్నతాధికారుల్లో అయోమయం మొదలైందట. ఇంతకీ ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి ఇచ్చే కాజ్ ఆఫ్ డెత్ లో ఏమని రాయాలి ? అనే సమస్య మొదలైందట. కాజ్ ఆఫ్ డెత్ అన్నచోట ఆక్సిజన్ అందక అని రాస్తే రాసినవాళ్ళందరికీ భారీగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సుంటుంది. ఎందుకంటే దుర్ఘటనలో చనిపోయినవారికి నష్టపరిహారంగా రు.10 లక్షలు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
కాజ్ ఆఫ్ డెత్ ఒకటే అన్నపుడు నష్టపరిహారం 11 మందికే ఎలా ఇస్తారు ? చనిపోయిన వారికందరికీ ఇవ్వాల్సిందే అని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీపార్టీల రంగప్రవేశంతో కుటుంబసభ్యుల డిమాండ్లు మరింత గట్టిగా వినబడుతోంది. ఇలాంటి అనేక సాంకేతికసమస్యల కారణంగానే చనిపోయినవారి వివరాలను 48 గంటల తర్వాత కూడా ప్రకటించలేకపోతున్నట్లు సమాచారం. మరి చివరకు ఏమి చేస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates