తెలంగాణలో లాక్ డౌన్ అంటూ మంగళవారం మధ్యాహ్నం సమాచారం బయటికి రావడం ఆలస్యం.. జనాలు ప్యానిక్ బయింగ్‌కు రెడీ అయిపోయారు. సూపర్ మార్కెట్లు.. కూరగాయల మార్కెట్లు.. ఇతర దుకాణాలు.. హోటళ్లు.. వైన్ షాపుల ముందు విపరీతమైన రద్దీ కనిపించింది. ముఖ్యంగా జీవితంలో ఇంకెప్పుడూ మద్యం దొరకదేమో అన్నట్లు వైన్ షాపుల మీద పడిపోయారు మందుబాబులు.
పది రోజుల లాక్ డౌన్లో రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జనాలకు అవసరమైన దుకాణాలన్నీ తెరిచే ఉంటాయని, ఏం కావాలన్నా కొనుక్కోవచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినా జనాలు ఆగలేదు. ఐతే ఇప్పుడు లాక్‌డౌన్‌కు సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయి. రాబోయే పది రోజుల్లో పూర్తిగా వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు సంబందించి మూతపడేవి ఏవి.. ఉదయం 6-10 మధ్య తెరుచుకునేవి ఏవి అనేది ఇందులో వివరించారు.
రాబోయే పది రోజుల్లో ఉదయం 6-10 గంటల మధ్య కూరగాయల మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, మిగతా ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందించే దుకాణాలన్నీ తెరుచుకుంటాయి. మంగళవారం సాయంత్రం మద్యం దుకాణాలపై దండెత్తిన మందు బాబులు కూడా భయపడాల్సిన పని లేదు. ఉదయం 6-10 మధ్య వైన్ షాపులు కూడా తెరుచుకుంటాయి. ఈ సమయంలో ప్రజా రవాణా కూడా ఉంటుంది. బస్సులు, మెట్రో రైళ్లు కూడా నడుస్తాయి.
సామాన్య ప్రజానీకం ఉదయం 10 తర్వాత బయట తిరగడానికి వీల్లేదు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా 24 గంటలూ బయట తిరడానికి అనుమతి ఉంది. కాగా ఈ పది రోజుల లాక్ డౌన్లో మాల్స్, సినిమా థియేటర్లు, పబ్బులు, పార్కులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ మాత్రం పూర్తిగా మూతబడి ఉంటాయి. రెస్టారెంట్లు, హోటళ్ల గురించి మార్గదర్శకాల్లో ఏమీ పేర్కొనలేదు. బహుశా వాటిలో డైనింగ్‌కు అవకాశం లేకుండా ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా హోం డెలివరీ మాత్రమే కల్పించే అవకాశాలున్నాయి.