చివరి నిముషంలో వయసు పైబడిందని, అనారోగ్యమని రజనీకాంత్ తప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే తలైవా సత్తా ఏమిటో తేలోయేదే మొన్నటి ఎన్నికల్లో. షెడ్యూల్ ఎన్నికలకు మరో నాలుగు మాసాలుందనగా హఠాత్తుగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు, కొత్తగా పార్టీ పెడుతున్నట్లు మొన్నటి డిసెంబర్లో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
వయసైపోయి, అనారోగ్యంతో ఉన్న రజనీ ఈ సమయంలో రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాడని చాలామంది అనుకున్నారు. అయినా సరే వెనక్కు తగ్గేది లేదంటు యమా ఫొజులిచ్చారు. కొద్దిరోజులు అభిమాన సంఘాలతో సమావేశలు పెట్టి చాలా హడావుడే చేశారు. సీన్ కట్ చేస్తే హైదరాబాద్ కు ఓ సినిమా షూటింగ్ కోసం వచ్చిన రజనీ కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరాల్సొచ్చింది.
దాంతో కొత్త పార్టీ అంటు చేసిన హడావుడికి బ్రేక్ పడింది. ఇదే సమయంలో ఆసుపత్రి నుండి డిస్చార్జి అయిన తలైవాను తీసుకెళ్ళేందుకు కూతురు హైదరాబాద్ కు వచ్చింది. ఇద్దరు కలిసి చెన్నైకు వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మధ్యలో ఏమైందో ఏమో రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు రజనీ. నిజంగానే రజనీ ఆ ప్రకటన చేయకుండా ముందుకే వెళ్ళుంటే పరువు పోయుండేదనటంలో సందేహం లేదు.
ఎందుకంటే ఒకవైపు డీఎంకే మరోవైపు ఏఐఏడీఎంకే ఎన్నికలను స్వీప్ చేసేశాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 140+ సీట్లు సాధిస్తే పళనిస్వామి ఆధ్వర్యంలోని ఏఐఏడీఎంకే కూటమి 71 చోట్ల గెలిచింది. ఒకవేళ రజనీ కూడా కంటిన్యు అయ్యుంటే తన సహచరులకు ఎదురైన అనుభవమే ఎదురయ్యేనదనటంలో సందేహంలేదు. సహచరులంటే కమలహాసన్ , శరత్ కుమార్, విజయకాంత్ అండ్ కో అన్నమాట. వీళ్ళ ముగ్గురికి సొంతంగా పార్టీలున్నాయి. వీళ్ళే వ్యవస్ధాపక అధ్యక్షులు.
వీళ్ళంతా పై రెండు కూటములకు వ్యతిరేకంగా ఒకటై ఎన్నికల్లో పోరాటం చేశారు. విచిత్రమేమిటంటే ముగ్గురు ఓడిపోవటమే కాకుండా వీళ్ళ పార్టీల తరపున పోటీచేసిన అభ్యర్ధులు కూడా తుడిచిపెట్టుకుపోయారు. ఒకవేళ రజనీ కూడా పోటీ చేసుంటే ఇంత కన్నా భిన్నమైన రిజల్టు వచ్చేదని ఆశించేందుకు లేదు. సెలబ్రిటీలను జనాలు ఆదరించటం లేదని తాజాగా అర్ధమైంది.
మహా ఉంటే రజనీ పార్టీకి ఓ నాలుగు సీట్లు వచ్చేదేమో చెప్పలేం. ఎందుకంటే పై ముగ్గురికన్నా రజనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి. మొత్తానికి చివరి నిముషంలో వెనక్కు తగ్గటం ద్వారా రజనీ తెలివైన నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి.