తెలంగాణలో ఈ మధ్య కరోనా కాకుండా చర్చనీయాంశంగా మారిన అంశం అంటే.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఉన్నట్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేయడమే. ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు రావడం, ఈ వ్యవహారంపై ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేసి అత్యవసరంగా భూముల సర్వే చేపట్టడం, ఆయన్ని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
ఈ కరోనా కల్లోల సమయంలో ఈటలను ఇంతగా టార్గెట్ చేయడానికి కారణం.. అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్న ఆయన తనతో కలిసొచ్చే నేతలతో కలిసి కొత్త పార్టీ పెట్టడానికి తెర వెనుక రంగం సిద్ధం చేస్తున్నాడన్న సమాచారం కేసీఆర్‌కు అందడమే అంటున్నారు. ఐతే ఈ ప్రచారంపై ఈటల స్పష్టమైన సమాధానం ఏమీ ఇవ్వలేదు. కానీ మాజీ ఎంపీ, కొన్ని రోజుల కిందటే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాటలను బట్టి చూస్తే కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్న, కలిసొచ్చే నేతలంతా కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈటల బర్తరఫ్ విషయమై తాజాగా విశ్వేశ్వరరెడ్డి ఒక హాట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరముందని.. అటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాను, ఈటల మరికొంత మంది ప్రయత్నిస్తున్నామని ఈ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామందిలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయనన్నారు. కేసీఆర్ కేబినెట్లోని మరో ఇద్దరు మంత్రులు తమతో టచ్‌లో ఉన్నట్లు విశ్వేశ్వరెడ్డి పేర్కొనడం విశేషం.
ప్రస్తుతం టీఆర్ఎస్పై పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీలు లేవు కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం తప్పనిసరిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ఆలోచనలకు రేవంత్‌రెడ్డి మద్దతు కూడా ఉందని విశ్వేశ్వరరెడ్డి చెప్పడాన్ని బట్టి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు తథ్యం అనుకోవచ్చు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పడం ద్వారా పార్టీ ఏర్పాటుకు ముహూర్తం దగ్గర్లోనే ఉందని విశ్వేశ్వరెడ్డి చెప్పకనే చెప్పినట్లయింది. ఈ సందర్భంగా షర్మిలకు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకోవడం లేదని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొనడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates