గోమూత్రం గొప్ప ఔషధం అంటూ బీజేపీ నేతలు తరచుగా ప్రకటనలు చేయడం మామూలే. ఐతే ఇప్పుడు లక్షల మంది ప్రాణాలను కబళిస్తూ ప్రపంచానికి సవాలు విసురుతున్న కరోనా మహమ్మారికి కూడా గోమూత్రాన్ని మందుగా అభివర్ణిస్తూ ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచారం సాగిస్తుండటం.. స్వయంగా ఒక వీడియో ద్వారా గోమూత్రాన్ని ఎలా సేవించాలో.. కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించడం అంరదినీ విస్మయానికి గురి చేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ ఎమ్మెల్యే పేరు సురేంద్ర సింగ్. ఆయన యూపీలోని బల్లియా జిల్లాలోని బైరియా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆయనొక వీడియోను విడుదల చేశారు. గోమూత్రం కరోనా నివారణకు అద్భుతంగా పని చేస్తుందని.. చాలా రోజులుగా తాను గోమూత్రం సేవించడం వల్లే కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉన్నానని ఆ ఎమ్మెల్యే సెలవిచ్చారు.
చల్లటి మంచి నీళ్లలో గోమూత్రం కలిపి తీసుకోవాలని ఆయన స్వయంగా వీడియోలో గోమూత్రం తాగే పద్ధతిని వివరించారు. ప్రతి రోజూ ఉదయం తాను ఇలాగే గోమూత్రం తాగుతానని.. 18 గంటల పాటు పని చేసినా కూడా తాను అలసిపోకుండా ఆరోగ్యంగా ఉండటానికి, కరోనా బారిన పడకపోవడానికి ఇదే కారణమని.. ప్రజలందరూ కూడా ప్రతి రోజూ ఇలాగే గోమూత్రం తాగి కరోనా నుంచి కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా మందులు వేసుకున్నపుడు డాక్టర్లు సూచించినట్లుగానే గోమూత్రం తాగాక అరగంట పాటు ఇంకేమీ తీసుకోవద్దని కూడా సురేంద్ర సింగ్ చెప్పడం విశేషం. కరోనాకే కాక గుండెజబ్బులు, ఇతర వ్యాధుల నివారణకు గోమూత్రం అద్భుతంగా పని చేస్తుందని ఆయన సెలవిచ్చారు.
ఈ వీడియో విషయమై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలే వ్యక్తమవుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సురేంద్ర సింగ్ మీద చర్యలు చేపట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సురేంద్రసింగ్ ఇలా వార్తల్లో నిలవడం ఇది తొలిసారి కాదు. సంచలనం రేపిన హథ్రాస్ రేప్ కేసు సందర్భంగా అమ్మాయిలను తల్లిదండ్రులు పద్ధతిగా పెంచితే, వారి ప్రవర్తన బాగుంటే రేప్‌లు జరగవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates