రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏమంత ఆశాజనకంగా లేవు. ఒక్క అధికార పార్టీ తప్ప.. మిగిలిన అన్ని పార్టీలూ కూడా అచేతనంగా ఉన్నాయి. నిజానికి చంద్రబాబు హయాంలో అయినా.. ఇతర ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. మిగిలిన పక్షాల ప్రభావం ఖచ్చితంగా ఉండేది. “వచ్చే ఎన్నికల నాటికి ఈ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం” అనో.. లేక.. అధికార పార్టీ పని అయిపోయింది.. సో.. ఈ పార్టీ పుంజుకోవడం ఖాయమనో.. చర్చ చోటు చేసుకునేది. నేతలు కూడా ఈ చర్చల ఆధారంగా తమ ఫ్యూచర్‌ను నిర్మించుకు నేందుకు ప్రయత్నించేవారు.
అయితే.. ప్రస్తుతం జగన్ మోహన్‌రెడ్డి పాలనలో మాత్రం ఆ తరహా పరిస్థితి లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని పక్కన పెడితే.. మిగిలిన మూడు పార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. అంటే.. కాంగ్రెస్ గత ఎన్నికల కంటే కూడా దారుణమైన పరిస్థితికి చేరుకుంది. ఇక, బీజేపీ పుంజుకున్నంత ఫీలింగ్ ఇచ్చినా.. ఏమీలేదని స్పష్టమైంది. తిరుపతి ఎన్నికల్లో దారుణ పరాభవంతో శ్రేణులు కూడా మౌనంగా ఉన్నారు., ఇక, జనసేన పార్టీ పరిస్థితి కూడా నాయకుడు చుట్టూ రాజకీయం అన్నట్టుగా మారిపోయింది.
కేడర్ లేకున్నా.. పార్టీ నడస్తుందని భావించే రోజులు లేకపోయినా.. ఇప్పుడు జనసేన మాత్రం కేవలం పేరుకే ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ఏ రాష్ట్రంలో అయినా.. రెండేళ్ల పాలన అనంతరం.. సదరు పాలక పక్ష పార్టీపై అంతో ఇంతో వ్యతిరేకత రావడం గమనార్హం. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే.. అక్కడ దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. దీంతో అధికార పార్టీ ఇక్కడ ఓడిపోయి.. ప్రతిపక్షం బీజేపీ గెలిచింది. ఇక, గ్రేటర్ మునిసిపల్ ఎన్నికలను చూసుకున్నా.. అధికార పార్టీకి తీవ్రస్థాయిలో దెబ్బ తగిలింది.అదే సమయంలో సాగర్‌లోనూ టఫ్ ఫైట్ నడిచింది. అంటే.. రెండేళ్ల పాలనపై ప్రజల్లో అంతో ఇంతో వ్యతిరేకత.. ప్రతిపక్షాలకు సానుకూలంగా మారింది.
ఇంకా చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ స్థానాలు దక్కాయి. కానీ, ఏపీలో మాత్రం ఆ తరహా పరిస్థితి లేకుండా పోయింది. రెండేళ్లు అయినా.. ప్రధాన ప్రతిపక్షాలు ఏవీ కూడా.. తమ సత్తా చాటు కోలేక చతికిల పడుతున్నాయి. దీంతో జగన్.. ఒక్క ఛాన్స్‌తో ఇంత దెబ్బవేస్తాడని అనుకోలేదనే కామెంట్లు సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.