పథకాలను పెంచుతానంటున్న బాబు గారు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి సీఎం చంద్ర‌బాబు వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం ప్రారంభించారా? ప్ర‌స్తుతం ఇస్తున్న ప‌థ‌కాల‌ను మ‌రింత పెంచ‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న పేట నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. సూప‌ర్ సిక్స్ హామీల‌ను ప్ర‌స్తావించారు. వీటి వ‌ల్ల రాష్ట్రంలో మెరుగైన జీవ‌నం క‌నిపిస్తోంద‌ని ముఖ్యంగా పేద‌ల కుటుంబాల‌లో ఇది ప్ర‌ధానంగా మార్పును తీసుకువ‌స్తున్నాయ‌న్నారు.

ప్ర‌స్తుతం ఇస్తున్న త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంలో ప్ర‌తి కుటుంబంలో ఎంత మంది చ‌దువుకునే పిల్ల‌లు ఉన్నా ఏటా రూ.15000 చొప్పున ఇస్తున్నారు. అయితే.. దీనిని మ‌రింత పెంచుతామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రిన్ని ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చే ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నామ‌ని ప్ర‌స్తుతం ఇస్తున్న ప‌థ‌కాల‌ను రెట్టింపు చేస్తామ‌ని చెప్పారు. సంప‌ద సృష్టితోనే ఇవ‌న్నీ సాకారం అవుతాయ‌న్నారు.

తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మ‌హిళ‌ల‌కు ఇచ్చిన అన్ని హామీల‌ను అమ‌లు చేశామ‌ని చంద్రబాబు తెలిపారు. ఆర్టీసీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని అమ‌లు చేస్తున్న విష‌యాన్ని చంద్ర‌బాబు చెప్పారు. దీనిని కూడా మ‌రింత విస్త‌రించే ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయ‌న్నారు. ఇదే స‌మయంలో ఆటో కార్మికుల‌కు ఇస్తున్న రూ.10000ల‌ను కూడా పెంచుతామ‌న్నారు. రాబోయే రోజుల్లో పేద‌ల‌కు ఉచితంగా క‌రెంటు స‌ర‌ఫ‌రా చేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ఎస్సీ, ఎస్టీల‌కు మాత్ర‌మే ప‌రిమితంగా ఉన్న ఉచిత విద్యుత్‌ను ఇతర పేద‌ల‌కు కూడా విస్త‌రించే ప్ర‌తి పాద‌న‌లు ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూపాయి కూడా విద్యుత్‌ చార్జీల‌ను పెంచ‌లేద‌న్న ముఖ్య మంత్రి.. వ‌చ్చే రోజుల్లో మ‌రింత‌గా త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం జాబ్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేశామ‌ని.. వ‌చ్చే రెండేళ్ల‌లో 20 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్ర‌క్రియ‌ను వేగవంతం చేశామ‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యంలోనూ పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలిపారు.