సంగం డెయిరీకి పెద్ద ఊర‌ట‌.. జ‌గ‌న్ జీవోను కొట్టేసిన హైకోర్టు

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ చైర్మ‌న్‌గా ఉన్న సంగం డెయిరీకి సంబంధించి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు అన్నింటినీ.. హైకోర్టు కొట్టివేసింది. దీంతో సంగం డెయిరీకి పెద్ద ఊర‌ట ల‌భించ‌గా.. సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మాత్రం పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్ట‌యింది. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సంగం డెయిరీ చైర్మన్‌ నరేంద్రపై పలు అవినీతి, అక్రమాలు, నయవంచన తదితర నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు కేసులు బనాయించారు.

ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ 1988 చట్టం ప్రకారం 13(1) (సీ) (డీ), ఐపీసీ 408 సెక్షన్‌ ప్రయోగించారు. డెయిరీకి సంబంధించి హోదాలో ఉన్న నయవంచనకు పాల్పడినట్టుగా సెక్షన్‌ 409 నమోదు చేశారు. వీటితోపాటు సంబంధిత సంస్థకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని మోసం చేసినట్టుగా సెక్షన్‌ 418ని కూడా నమోదు చేశారు. నయవంచన, మోసానికి సంబంధించి సెక్షన్‌ 420, ఆయా పత్రాల ఫోర్జరీకి సంబంధించి సెక్షన్‌ 465, తప్పుడు పత్రాలు అని తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా అవి ఒరిజినల్‌గా గుర్తించారనే అభియోగం మేరకు సెక్షన్‌ 471ను నమోదు చేశారు.

డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, విశ్రాంత డీసీవో గురుమూర్తిలను సైతం పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఇలా ఉంటే.. డెయిరీని ఏపీ డెయిరీలో విలీనం చేసేలా.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదేస‌మ‌యంలో ప్ర‌త్యేక అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో డైరెక్ట‌ర్లు.. హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై తాజాగా విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. సంగం డెయిరీలో డైరెక్ట‌ర్ల‌కే పూర్తి ఆధిప‌త్యం ఉంటుంద‌ని తేల్చి చెప్పింది.

అదేస‌మ‌యంలో డైరెక్ట‌ర్లు సాధార‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, డెయిరీని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. అదేస‌మ‌యంలో సంగం డెయిరీ ఆస్తుల క్ర‌య విక్ర‌యాలు.. త‌మ‌కు చెప్పే నిర్ణ‌యం తీసుకోవాల‌ని, త‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇవి సాగుతాయ‌ని తేల్చి చెప్పింది. మొత్తంగా అత్యంత కీల‌క‌మైన ఏపీ డెయిరీ ప‌రిధిలోకి తీసుకువ‌స్తూ.. తీసుకువ‌చ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఈ ప‌రిణామంతో సంగం డెయిరీకి భారీ ఊర‌ట ల‌భించ‌గా.. జ‌గ‌న్ స‌ర్కారుకు పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.