ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత కేసీయార్ పైన ఒత్తిడి పెరిగిపోతోందట. రాజీనామాతో పోయేదానికి కేసీయార్ బర్తరఫ్ దాకా తీసుకెళ్ళారనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోంది. భూకబ్జాల ఆరోపణలు రాగానే వెంటనే ఈటల రాజేందర్ నుండి మంత్రిత్వ శాఖలను పీకేశారు. మరుసటి రోజు ఏకంగా బర్తరఫ్ చేసేశారు. నిజానికి ఈటలకు జరిగిన ఘోర అవమానంగానే భావించాలి.
ఆశ్చర్యమేమంటే ఇదే విధమైన లేదా ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు మంత్రులు, ఎంఎల్ఏలపైన మాత్రం కేసీయార్ అసలు స్పందించనేలేదు. దాంతో ఇపుడు ఈటల బర్తరఫ్ వివాదం కాస్త రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో హైకోర్టు కూడా ఈటల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టడంతో రాజేందర్ కు మద్దతు పెరుగుతోంది.
సరిగ్గా ఈ నేపధ్యంలోనే రాజీనామా విషయంలో కేసీయార్ పైన కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. కేసీయార్ వెంటనే గజ్వేల్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. రాజేందర్ మద్దతుదారులు మాట్లాడుతూ కేసీయార్ వెంటనే రాజీనామా చేసి హుజూర్ నగర్లో ఈటలపై పోటీ చేసి గెలవాలంటూ చాలెంజ్ చేస్తున్నారు.
హుజూర్ నగర్ ఎంఎల్ఏగా తొందరలోనే రాజేందర్ రాజీనామా చేయబోతున్నట్లు మద్దతుదారులు చెబుతున్నారు. అప్పుడు వచ్చే ఉపఎన్నికలో ఈటలపై కేసీయార్ పోటీచేసి గెలవాలంటూ మద్దతుదారులు విసిరిన సవాలుకు మద్దతు పెరిగిపోతోంది. ఇపుడిదే విషయమై టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలతో పాటు జనాల్లో కూడా బాగా చర్చ జరుగుతోంది. మరి గతంలో లాగ కేసీయార్ ఇపుడు కూడా సవాలును స్వీకరిస్తారా ? చూడాలి ఏమి జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates