మీ అస్త్రం మీపైనే… బెంగాల్లో బీజేపీ గుర‌వింద నీతి ?


దేశ‌వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తిరుగులేని విజ‌యం సాధించారు. తృణ‌మూల్ గెలిచిన వెంట‌నే బెంగాల్లో తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. కొన్ని చోట్ల బీజేపీ వాళ్ల‌పై చిన్నా చిత‌కా దాడులు జ‌రిగాయి. బీజేపీ ఆఫీసులు కూడా త‌గ‌ల‌బ‌డ్డాయి. వీటిపై కూడా అనేక సందేహాలు ఉన్నాయి. స‌రే ఇదిలా ఉంటే త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు ప‌రిగెత్తించి మ‌రీ కొడుతున్నారు బాబోయ్‌.. మొర్రోయ్ అంటూ బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం గ‌గ్గోలు పెడుతోంది. అక్క‌డ రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని కోరుతున్నారు. పైగా ప్రజాస్వామ్య దేశంలో..ఇటువంటి ధోరణి ప్రమాదకరం అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

బీజేపీ ఏడుపుపై జాతీయ స్థాయిలో సెటైర్లు పేలుతున్నాయి. బీజేపీ వాళ్లు ఇప్పుడు బెంగాల్లో త‌మ పార్టీ కేడ‌ర్‌ను టార్గెట్ చేస్తున్నార‌ని పెడ‌బొబ్బ‌లు పెడుతున్నా వారు 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టి నుంచి ప‌లు రాష్ట్రాల్లో అధికార దాహంతో చేసిన అరాచ‌కానికి అంతు లేదు క‌దా ? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ పార్టీ లేదు.. ఈ పార్టీ లేదు.. ఎన్నో పార్టీల కేడ‌ర్ బీజేపీ అధికార మ‌దానికి టార్గెట్ అయ్యార‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. బీజేపీ ఎప్పుడూ హిందూత్వ ముసుగులో చేసే రాజ‌కీయం ప్ర‌జాస్వామ్యానికి అతి పెద్ద ప్ర‌మాదం కాదా ? అన్న వాళ్లూ ఉన్నారు. అదేమ‌ని ప్ర‌శ్నిస్తే వారి నోరు నొక్కేస్తుంది.

ఇక బెంగాల్లో రెండు, మూడు విడ‌త‌ల్లో ముగియాల్సిన ఎన్నిక‌ల‌ను ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 8 విడ‌త‌ల పాడు పొడిగించింది. ఎన్నిక‌ల కోడ్ పేరుతో వ్య‌వ‌స్థ‌ను లోబ‌ర‌చుకోవ‌డంతో పాటు అక్క‌డ అధికారం మాదే అని ఇష్ట‌మొచ్చిన‌ట్టు రెచ్చిపోయి మ‌రీ వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌ల‌ను కేంద్ర బ‌ల‌గాల అండ‌తో ఓ ఆటాడుకున్నార‌ని తృణ‌మూల్ కేడ‌ర్ గ‌గ్గోలు పెట్టినా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. మ‌మ‌త‌ను వీల్ చెయిర్‌లో కూర్చొంది అంటూ హేళ‌న చేశారు. అమ్ముడు పోయిన జాతీయ మీడియా ఇవేవి చూపించ‌లేదు.

ఇక ఆంధ్రాలో ప్ర‌భుత్వ ఆస్తుల అమ్మ‌కాలు, అన్యాయాల గురించి అడిగే వాడే లేదు. ఇలా దేశంలో ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌భుత్వాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అధికార మ‌దంతో చేస్తోన్న చ‌ర్య‌ల గురించి దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు బెంగాల్లో మ‌మ‌త బెబ్బులిలా అదే స్టైల్లో బీజేపీని చావు దెబ్బ తీస్తుండ‌డంతో బీజేపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కేవ‌లం హిందూత్వ వాదాన్ని త‌మ అధికారం కోసం బీజేపీ ఎలా వాడుకుంటుందో అన్న విష‌యం హిందువులు కూడా గ్ర‌హించారు. అందుకే బెంగాల్ కావొచ్చు… ఆంధ్రా కావొచ్చు.. తెలంగాణ‌, త‌మిళ‌నాడులో ఎక్క‌డైనా ఆ పార్టీని ఓడిస్తూ వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆంధ్రాతో పాటు త‌మిళ‌నాడు వంటి చోట్ల ప్రాంతీయ పార్టీల‌తో బీజేపీ పైకి ఒక‌లా.. లోప‌ల మ‌రోలా పెట్టుకున్న సంబంధాల‌ను కూడా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. బీజేపీ దెబ్బ‌కే త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే అడ్ర‌స్ గ‌ల్లంతైంది. ఇక రేపు ఏపీలో ప‌రిస్థితి ఏంటో కాల‌మే స‌మాధానం చెప్పాలి.