తాజాగా జరిగిన ఎన్నికల్లో సినీ సెలబ్రిటీలను జనాలు తిరస్కరించినట్లేనా ? వెల్లడైన ఫలితాలను బట్టిచూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బెంగాల్, అస్సాం రాష్ట్రాల సంగతేమో గానీ ధక్షిణాదిలో మాత్రం ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. తమిళనాడు, కేరళలో అనేక పార్టీల తరపున పలువురు సెలబ్రిటీలు పోటీ చేశారు. అయితే వాళ్ళలో అత్యధికులు ఓడిపోయారు.
తమిళనాడు విషయం చూస్తే కమలహాసన్, శరత్ కుమార్, ఖుష్బూ, విజయకాంత్ లాంటి వాళ్ళు చాలామందే పోటీచేశారు. అయితే వీళ్ళల్లో ఎవరు గెలవలేదు. డీఎంకే తరపున చేపాక్ నియోజకవర్గంలో పోటీచేసిన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మాత్రమే గెలిచారు. బహుశా ఉదయనిధి డీఎంకే తరపున అందులోను కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్న డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొడుకు హోదాలో పోటీచేశారు కాబట్టి ఆ గాలిలో గెలిచుండవచ్చు.
కోయంబత్తూరు ధక్షిణ నియోజకవర్గంలో కమలహాసన్ గెలుపు ఖాయమనే అనుకున్నారు. ఎందుకంటే చాలా రౌండ్లు కమల్ లీడ్ లోనే ఉన్నారు. అయితే చివరకు వెనకబడిపోయి ఓడిపోయారు. ఇక శరత్ కుమార్, విజయకాంత్, ఖుష్బూ లాంటివాళ్ళయితే ఏ దశలో కూడా గెలుస్తారనే సూచన కూడా కనబడలేదు. కాబట్టి తమిళనాడులో సెలబ్రిటీలను జనాలు గెలుపుకు దూరంగా పెట్టేశారనే చెప్పాలి.
ఇక కేరళ సంగతి చూస్తే ఇక్కడ పోటీచేసింది కూడా తక్కువే. బీజేపీ తరపున ప్రముఖ సినీహీరో సురేష్ గోపి పోటీచేశారు. అయితే ఆయన కూడా ఓడిపోయారు. పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ కూటమి ప్రంభంజనం ముందు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు చాలామంది తట్టుకోలేకపోయారు. లెఫ్ట్ కూటమి, కాంగ్రెస్ పార్టీ తరపున సెలబ్రిటీలెవరు పోటీచేసినట్లు లేదు.
అయినా సెలబ్రిటీలను జనాలు ఎందుకిలా తిరస్కరించినట్లు ? ఎందుకంటే వీళ్ళకు ఓట్లేసి గెలిపించినా మళ్ళీ అడ్రస్ ఉండరని అనుమానించినట్లున్నారు. వీళ్ళు గెలిచిన నియోజకవర్గాల్లో సమస్యలు చెప్పుకోవాలంటే సెలబ్రిటీలు అందుబాటులో ఉండరని అనుకుని ఉంటారు. అందుకనే అత్యధికులను జనాలు తిరస్కరించారు. అయితే తాజా ఎన్నికల్లో ఓడిపోయిన సినీ సెలబ్రిటీలంతా మరో ఐదేళ్ళు జనాల్లోనే ఉండి సమస్యలపై పోరాటాలు చేసి నమ్మకం సంపాదించుకుంటే అప్పుడు జనాలు ఓట్లేసి గెలిపిస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates