మూడు వర్గాలే బీజేపీని దెబ్బకొట్టాయా?

ఇటీవలే వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఓ విషయం స్పష్టమైంది. మూడు పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలోని మూడువర్గాలు బీజేపీని గట్టిగా దెబ్బకొట్టినట్లు అర్ధమవుతోంది. ముస్లిం మైనారిటిలు, క్రిస్తియన్ మైనారిటిలతో పాటు మహిళలు కూడా కమలం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఓట్లేసినట్లు సమాచారం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో మోడి, అమిత్ షా, నడ్డా అండ్ కో బాగా కష్టపడినప్పటికీ ఆ పడిన కష్టానికి ఫలితం కనబడలేదు.

నిజానికి ఏ ఎన్నికల్లో అయినా కేంద్రప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అభివృద్ధి పనులనే ప్రధానంగా హైలైట్ చేసుకుంటుంది. అయితే అందుకు విరుద్ధంగా మోడి అండ్ కో ప్రధానంగా మమతబెనర్జీ వ్యక్తిత్వాన్ని టార్టెట్ చేయటం ఆశ్చర్యమేసింది. దీన్ని వ్యతిరేకించిన మహిళలు పెద్దఎత్తున మమతకు మద్దతుగా నిలబడ్డారు. అలాగే మైనారిటిలు కూడా గుండుగుత్తగా తృణమూల్ కే ఓట్లేశారట. కాకపోతే కాంగ్రెస్+వామపక్షాల ఓట్లు పడిన కారణంగా బీజేపీకి గౌరవప్రదమైన సీట్లొచ్చాయి.

అలాగే కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పినరయి విజయన్ను పై ఆరోపణలు, విమర్శలు చేసినా జనాలు పట్టించుకోలేదు. ఉత్తర, మధ్య కేరళలోని మైనారిటీలంతా మూకుమ్మడిగా విజయన్ కే ఓట్లేశారట. విజయన్ పనితీరు సంతృప్తిగా ఉన్న కారణంగానే బీజేపీకి రాష్ట్రంలో చోటు దక్కలేదు. ఉత్తర కేరళలో గట్టిపట్టున్న ముస్లింలీగ్ కూడా విజయన్ కే మద్దతుగా నిలబడింది. ఇలాంటి కారణాలతో అసెంబ్లీలో ఉన్న ఒక్క ఎంఎల్ఏ సీటును కూడా బీజేపీ కోల్పోయింది.

ఇక తమిళనాడులో పై మూడువర్గాలు కూడబలుక్కున్నట్లుగా డీఎంకే కే మద్దతుగా నిలబడ్డాయి. పురట్చితలైవి జయలలిత లేకపోవటంతో మహిళా ఓట్లన్నీ ఏకపక్షంగా డీఎంకేనే బలపరిచినట్లు విశ్లేషణలు అందుతున్నాయి. ఇక ముస్లిం, క్రిస్తియన్ మైనారిటిలు కూడా స్టాలిన్ కే మద్దతుగా నిలబడ్డారు. కాకపోతే ఏఐఏడీఎంకేతో పొత్తున్న కారణంగా బీజేపీ ఇక్కడ మొదటిసారి నాలుగు సీట్లలో గెలిచింది. మొత్తానికి మోడి అండ్ కో వేసిన ఎత్తులు పై మూడు రాష్ట్రాల్లో ఏమాత్రం పనిచేయలేదని స్పష్టమైపోయింది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)