ఈ కరోనా విలయానికి కారణం కర్నూలా?

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఫస్ట్ వేవ్ వచ్చినపుడు ఒక రోజుకు గరిష్ట కేసుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య వెయ్యికి చేరితేనే వామ్మో వాయ్యో అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు రోజుకు 4 లక్షల దాకా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 3-4 వేల మధ్య ఉంటున్నాయి. ఇవి అధికారికంగా చెబుతున్న లెక్కలు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. గత ఏడాదితో పోలిస్తే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ఇందుకు కారణం.. ప్రస్తుత కరోనా వైరస్ వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉండటమే అంటున్నారు నిపుణులు. ఈ వేరియంట్ బయటపడింది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అని, దేశంలో ప్రస్తుతం కరోనా ప్రభావం ఇంతగా పెరిగిపోవడానికి కారణం కూడా ఈ వేరియెంటే అని మీడియాలో వార్తలొస్తుండటం గమనార్హం. జాతీయ మీడియాలోనూ దీని గురించి చర్చ జరుగుతోంది. ఇంతకుముందు బయటపడ్డ కరోనా వేరియెంట్లలో బీ-1.617, బీ-2.618 అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. వాటిని మించి కొత్తగా బయటపడ్డ కరోనా స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైందిగా పేర్కొంటున్నారు.

గత వేరియెంట్లతో పోలిస్తే ఇది 10-15 రెట్లు అధికంగా విస్తరించే సామర్థ్యం కలిగినదని.. ఏపీ తెలంగాణల్లో విపరీతంగా కేసులు పెరిగిపోవడానికి ఈ వేరియెంటే కారణమని.. అదే దేశమంతా పాకిపోయి కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోవడానికి కారణమైందని అంటున్నారు. దీన్ని ‘ఏపీ స్ట్రెయిన్’గా పేర్కొంటుండం.. జాతీయ స్థాయిలో దాని గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం. ఐతే ఏపీ అధికారులు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఏపీలో కొత్త వేరియెంట్ లాంటిదేమీ బయటపడలేదని అంటున్నారు. దీనిపై నిపుణులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)