కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న ఏపీలో.. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదేసమయంలో నిత్యం పదుల సంఖ్యలో వైద్య అందక, కరోనా తీవ్రతతో మృతి చెందుతున్నారు. మరో వైపు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేస్తున్నామని చెబుతున్నా ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్ల లభ్యత లేక.. కరోనా బాధితుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి. సెకండ్ వేవ్‌తోనే ఏపీ అల్లాడుతుంటే.. ఇప్పుడు.. ఏపీలో అత్యంత ప్రమాదకర వైరస్ వ్యాప్తి, కరోనా కంటే 10 రెట్లు డేంజర్‌గా భావిస్తున్న N 440 K వైరస్ వ్యాప్తి చెందుతోందని.. ఈ విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం కూడా ఉదాసీనతను కట్టిపెట్టి .. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
లాక్డౌన్ తప్పదు!
సోమవారం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాపించిన కొత్త వైరస్ విషయంపై తనకు కర్నూలుకు చెందిన సీనియర్ వైద్యులు సమాచారం అందించిన విషయాన్ని తమ్ముళ్లతో పంచుకున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ N 440 K వ్యాపించిందన్నారు. దీన్ని తొలిసారిగా కర్నూలులో సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు. ఇది ఇతర వైరస్ల కంటే 10 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఒడిశాలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించించారని చంద్రబాబు గుర్తు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్నారు.
వ్యాక్సిన్ 1500 కోట్లు ఖర్చు పెట్టలేరా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజలకు వ్యాక్సిన్ అందించే విషయంలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల కోసం రూ.3,000 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో గోరంతను కొండంతలుగా చేసి ప్రచారం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి తన సొంత మీడియాలో ఫుల్ పేజీ యాడ్స్ కోసం రూ. వందల కోట్లు దుబారా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పథకాలు తర్వాత.. ప్రజలే ముందు!
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బెడ్లు-ఆక్సిజన్ సరఫరా పెంచాలన్నారు. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పథకాల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని, కానీ, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటే.. పథకాలు పెట్టి ఏం ప్రయోజనమని.. ఆ డబ్బులు.. వ్యాక్సిన్ సహా వైద్య సదుపాయాలకు ఖర్చు పెట్టాలని.. చంద్రబాబు.. జగన్ సర్కారుకు హితవు పలికారు. ఏదేమైనా.. ప్రస్తుతం వెలుగు చూసిన కొత్త రకం వేరియంట్ మరెంతమంది ప్రాణాలు తీస్తుందో… ప్రభుత్వ ఏమేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.