అప్పుడు ఓడి.. ఇప్పుడు గెలిచి.. బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్‌

తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఇక‌, పుంజుకునేది లేద‌ని.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని భావిస్తున్న కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. అది కూడా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్పొరేట‌ర్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పుంజుకుంది. లింగోజీ గూడ కార్పొరేట‌ర్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అనూహ్యంగా కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది.

వాస్త‌వానికి గ‌త రెండు నెల‌ల కింద‌ట‌ జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కేవ‌లం రెండు స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఇక‌, కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. లింగోజీగూడ నుంచి గెలిచిన బీజేపీ అభ్య‌ర్థి మ‌ర‌ణంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ్నుంచి పోటీ పెట్టొద్దని మంత్రి కేటీఆర్‌ను బీజేపీ ముఖ్య నేతలు రిక్వెస్ట్ చేయడంతో.. టీఆర్ఎస్ తరఫున ఎవర్నీ పెట్టలేదు.

దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌కు నూతన ఉత్సాహం వచ్చినట్లుయ్యింది. కాగా.. లింగోజిగూడ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి అభ్యర్థి మందుగుల అఖిల్‌ పవన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్‌, జల్ల నాగార్జున, షేక్‌ ఫర్వేజ్‌ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేట్ల సంఖ్య మూడుకు చేరుకుంది. అధికార పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండుంటే పరిస్థితులు వేరేగా ఉండేవని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.