ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. నూతన రాజకీయాన్ని ఆవిష్కరిస్తానంటూ వచ్చిన మరో ప్రముఖ నటుడికి ఎన్నికల రణరంగంలో చేదు అనుభవం ఎదురైంది. జయలలిత ఉన్నంత వరకు రాజకీయాలు తనకు పడవన్నట్లు మాట్లాడి.. ఆమె మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేయొచ్చనే ఆశతో మూడేళ్ల ముందు మక్కల్ నీదిమయం పార్టీ పెట్టి లౌకిక వాదాన్ని గట్టిగా వినిపిస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్న తమిళ లెజెండరీ నటుడు కమల్ హాసన్.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
తీవ్ర ఉత్కంఠ రేపిన కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఎన్నికల ఫలితం చివరికి కమల్‌కు వ్యతిరేకంగా వచ్చింది. కౌంటింగ్ మొదలైన మొదట్లో వెనుకబడ్డ కమల్.. తర్వాత స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. చాలా వరకు ఆధిక్యం వెయ్యికి అటు ఇటుగానే సాగింది. చివరికి ఆయన కేవలం 72 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్‌పై విజయం సాధించినట్లుగా వార్తలొచ్చాయి.
కమల్ విజయం సాధించారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా వార్తలొచ్చాయి. ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అసెంబ్లీలో కమల్, ప్రభుత్వాన్ని ఆటాడించడానికి ఆయనొక్కడు చాలు అంటూ అభిమానులు హడావుడి చేశారు. కానీ తీరా చూస్తే కమల్ గెలవలేదని తేలింది. ఆయన వానతి శ్రీనివాసన్ చేతిలోనే 1300 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసినట్లు వెల్లడైంది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. కమల్ అభిమానుల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎన్నికల ప్రచారం చేసినపుడు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
దీంతో ఎంఎన్ఎం పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. కమల్ గెలుస్తారని అభిమానులు ఆశించారు. కానీ చివరికి ఆయన సైతం ఓటమి చవిచూశారు. ఎంఎన్ఎం పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరూ విజయం సాధించలేదు. అధికారం చేపడుతున్న డీఎంకే పార్టీ పరోక్షంగా కమల్‌కు మద్దతుగా నిలిచినా ఫలితం లేకపోయింది. తమిళనాడు సీఎం అయిపోదామన్న లక్ష్యంతో పార్టీ పెట్టిన కమల్‌కు ఇలాంటి పరాభవం ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates