తిరుప‌తి ఫ‌లితం.. టీడీపీ నేత‌ల‌ను డిసైడ్ చేస్తుందా..?


తిరుప‌తిలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మై పోయింది. దాదాపు 65 శాతం ఓటు బ్యాంకుతో వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌ని.. వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి విజ‌యం ద‌క్కించుకుంటార‌ని ఎగ్జిట్ పోల్ ఫ‌లితం వ‌చ్చింది. అయితే.. ఇదే జ‌రిగితే.. వైసీపీలో మార్పులు వ‌స్తాయా ? పార్టీలో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి మ‌రింత ఇబ్బంది ప‌డాల్సి ఉంటుందా ? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్త‌వ‌మే. పార్టీ పుంజుకునే ప‌రిస్థితి లేక‌పోతే.. బ‌య‌ట‌కు వ‌చ్చే నాయ‌కులు ఉన్నారు.

అలాగ‌ని.. పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే ప‌రిస్థితి ఉంటుందా? అంటే క‌ష్ట‌మే. ఎందుకంటే.. పార్టీకి సంస్థాగ‌తంగా ఉన్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని సీనియ‌ర్లు పార్టీ మారే అవ‌కాశం లేదు. పైగా.. వైసీపీలోకి వెళ్లిపోతే.. వారికి ల‌భించే గుర్తింపు ఏంటో ఇప్ప‌టికే పార్టీ మారిన నేత‌ల‌ వ‌ల్ల‌.. స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సో.. పార్టీ మారితే.. వీరికి అంత‌కు మించిన గుర్తింపు ద‌క్కే అవ‌కాశం లేదు. ఇప్ప‌టికే ఇలా మారిన వారు కూడా వైసీపీలో ఇమ‌డ‌లేక పోతున్నారు. స్థానికంగా బ‌లంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు.. వీరిమ‌ధ్య తీవ్ర వివాదాలు, విభేదాలు అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతూనే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కొత్త‌గా పార్టీమారినా.. వారికి ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు. సో.. పార్టీలోనే ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా మ‌రో రెండేళ్లు ఓర్చుకుంటే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి టీడీపీ వ్యూహాత్మ‌కంగా జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని సంకేతాలు వ‌స్తున్నాయి. తిరుప‌తిలో క‌నుక బీజేపీకి పెను దెబ్బ‌తగిలితే విధిలేని ప‌రిస్థితిలో అయినా.. టీడీపీతో పొత్తుకు సిద్ధ‌మ‌య్యే ప‌రిస్థితి ఉంది. దీంతో మ‌ళ్లీ టీడీపీ పుంజుకునే అవ‌కాశం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. తిరుప‌తి ఫ‌లితం ఒక్క‌టే టీడీపీ నేత‌ల‌ను డిసైడ్ చేయ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కొంద‌రు టీడీపీ నేత‌లు తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం, మెజార్టీ త‌ర్వాత టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నా.. వైసీపీలో ప‌రిస్థితులు చూసుకుని గ‌మ్మ‌నుండ‌డం మిన‌హా చేసేదేం ఉండ‌డం లేదు.