ఇదంతా మోడిపై వ్యతిరేకతేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలిపై వ్యతిరేకత కర్నాటకలో బయటపడిందా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే. కర్నాటకలో కొన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినేసింది. మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటిలు, నగర పాలకసంస్ధలు కలిపి 163 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 140 చోట్ల కాంగ్రెస్ బంపర్ మెజారిటితో గెలిచింది. జేడీఎస్ 66 చోట్ల గెలిస్తే, బీజేపీ మూడోస్ధానంతో 57 స్ధానాలకే పరిమితమైంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా అధికారంలో ఉన్నపార్టీకే అనుకూలంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కర్నాటకలో బీజేపీనే అధికారంలో ఉన్నా జరిగిన కొన్ని స్ధానాల్లో మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. అంటే కమలంపార్టీపై జనాల్లో ఏ స్ధాయిలో వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది.

అధికారంలో ఉన్నా బీజేపీకి ఇంత ఘోరంగా ఓడిపోవటం ఇదే మొదలు. అయినా బీజేపీపై జనాల్లో ఇంత వ్యతిరేకత పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమయ్యుంటుంది ? ఏమిటంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను నియంత్రించటంలో నరేంద్రమోడి ఘోరంగా విఫలమవ్వటం. మోడి వైఖరి కారణంగానే దేశం మొత్తం కరోనా సెకెండ్ వేవ్ సంక్షోభంలో కూరుకుపోతోందనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోంది. కర్నాటకలో కూడా కరోనా కేసులు వేలకొద్ది నమోదవుతున్నాయి.

ఇక రెండో కారణం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయటానికి మోడి ఇష్టపడకపోవటం. కొద్దినెలలుగా ఢిల్లీ శివార్లలో మూడునూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనల్లో కర్నాటక రైతుసంఘాల్లోని రైతులు కూడా ఉన్నారట. మొత్తంమీద నరేంద్రమోడి మీద జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత కర్నాటకలో స్పష్టంగా బయటపడిందని అనుకుంటున్నారు. మరి ఆదివారం వెలువడుతున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కతేంటో తేలిపోతుంది.