ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న కేబీఆర్ పార్క్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ పార్క్‌కు సమీపంలో ఉన్న భారీ నుంచి అతిభారీ వృక్షాలనుఎట్టి పరిస్థితిలోనూ నరికేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. పర్యావరణ అనుకూల చట్టాలను యథాతథంగా అమలు చేయాలని నిర్దేశించింది. అంతేకాదు.. ప్రభుత్వమే చెట్లను కూల్చి వేస్తోందన్న న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారం చాలా శోచనీయమని… ప్రభుత్వమే కూల్చేస్తే.. ఇక, ప్రైవేటు వ్యక్తులను ఎవరు నియంత్రిస్తారని ప్రశ్నించింది. చెట్లను ఎట్టి పరిస్థితిలోనూ కూల్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
విషయం ఏంటి?
కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ఉదయం 8-10 మధ్య, సాయంత్రం 6-10 మధ్య గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతో ఇక్కడ ఫ్లై వోవర్ నిర్మాణం చేపట్టాలని గత కేసీఆర్ ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ క్రమంలో కేబీఆర్ పార్కు సమీపంలో భారీవృక్షాలను నరికేయాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే ఫ్లై వోవర్ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఇంజనీర్లు తేల్చిచెప్పారు. అయితే.. అప్పట్లోనే దీనిపై పర్యావరణ ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చెట్లను నరకరాదని స్పష్టం చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణంపై తాత్సారం చేసింది.
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ను తీర్చి దిద్దాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే కేబీఆర్ పార్కు ఫ్లై వోవర్ నిర్మాణ ఫైలును బయటకు తీశారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.
అయితే.. గతంలో ఇంజనీర్లు చెప్పినట్టు చెట్లను తొలగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో హైడ్రా ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు సమీపంలోని చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీనిపై వివేక్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వమే చెట్లు నరుకుతోందని పేర్కొన్నారు.
విచారణ జరిపిన కోర్టు.. కేబీఆర్ పార్కుకు 20-30 మీటర్ల పరిధిలో చెట్లను నరకడానికి వీల్లేదని, పర్యావరణ చట్టాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఫ్లైవోవర్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని సూచించింది. ఒకవైపు పర్యావరణం వేడెక్కుతున్న పరిస్థితిని గమనిస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో చెట్లనునరికేందుకు ఎలాంటి అనుమతులు ఉండబోవని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై కి వాయిదా వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates